
మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ విరాట్ కోహ్లి
ఒక్కడై నిలిచి కోహ్లి కొల్లగొట్టిన పరుగులు,
ఒక్క పరుగుతో ప్రాణం లేచి వచ్చిన క్షణాలు... గేల్ దూకుడు, రాయ్ మెరుపులు... ఇలా ఎన్నో అపురూప ఘట్టాలు కలగలిపి టి20 క్రికెట్ ప్రపంచ కప్ ‘సిక్సర్’ కొట్టింది. పొట్టి క్రికెట్ పుట్టిన 11 ఏళ్లలోపే విశ్వ వేదికపై ఆరు సార్లు జట్లు పోటీ పడ్డాయి. ఇందులో ఐదు జట్లు విజయాన్ని అధిరోహించాయి. తొలిసారి భారత్‌లో జరిగిన ఈ ధనాధన్ ఆట అభిమానులకు ఆనందాన్ని పంచింది. అందరూ ఆశించినట్లుగా మన జట్టు జగజ్జేతగా నిలవకపోయినా... వినోదానికి మాత్రం లోటు లేకుండా పోయింది. మరో ప్రపంచ కప్ వచ్చే వరకు మన మనసుల్లో నిలిచిపోయే కొన్ని క్షణాలు....
పరుగుల వరద..
ధనాధన్ క్రికెట్‌కు అసలైన ఉదాహరణలా సాగిన మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగింది. ముగ్గురు అర్ధ సెంచరీలు చేయడంతో తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 229 పరుగులు చేసి నిశ్చింతగా కనిపించింది. కానీ ఇంగ్లండ్ మరో 2 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి క్రికెట్ ప్రపంచానికి షాక్ ఇచ్చింది.
చివరి ఓవర్ డ్రామా...
వరల్డ్‌కప్ మొత్తానికి హైలైట్‌గా నిలిచిన ఘటన భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో జరిగింది. హార్దిక్ పాండ్యా వేసిన ఆ ఓవర్లో విజయం కోసం 11 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ 3 బంతుల్లోనే 9 పరుగులు రాబట్టింది. మ్యాచ్ పూర్తి కాక ముందే ముష్ఫిఖర్ సంబరాలు కూడా చేసుకున్నాడు. కానీ చివరి 3 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా భారత్ 3 వికెట్లు తీసి ఒక పరుగుతో సంచలన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఆఖరి బంతికి ముస్తఫిజుర్‌ను ధోని రనౌట్ చేసిన తీరు ప్రజల మనసుల్లో చిరకాలం నిలిచిపోయింది.
వారెవ్వా రాయ్...
యువ ఆటగాళ్లతో కొత్తగా కనిపించిన ఇంగ్లండ్ జట్టులో జేసన్ రాయ్ తన దూకుడుతో దూసుకొచ్చాడు. టోర్నీ రెండు సార్లు మెరుపు ఆరంభాలతో అతను తమ జట్టు విజయం కోసం వేదిక సిద్ధం చేశాడు. దక్షిణాఫ్రికాపై 16 బంతుల్లోనే 43 పరుగులు చేసిన రాయ్, సెమీస్‌లో న్యూజిలాండ్‌తో 154 పరుగుల ఛేదనలో 44 బంతుల్లో 78 పరుగులు చేసి మ్యాచ్‌ను శాసించాడు.
11-0
ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై మన అద్భుత రికార్డు అలాగే కొనసాగింది. కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్లతో పాక్‌ను చిత్తు చేసింది. వన్డే వరల్డ్ కప్‌లలో ఆరు సార్లు దాయాదిని ఓడించిన భారత్‌కు టి20 వరల్డ్‌కప్‌లలో ఇది ఐదో విజయం.
అప్ఘన్ సంచలనం...
ప్రతీ వరల్డ్ కప్‌లో కనీసం ఒక్క అనూహ్య ఫలితమైనా రావడం రివాజుగా మారింది. ఈసారి అఫ్ఘానిస్తాన్ వంతు వచ్చింది. టోర్నీ ఆరంభం నుంచి ప్రతీ జట్టును వణికించిన అఫ్ఘన్ చివరకు తాము అనుకున్నది సాధించింది. వెస్టిండీస్‌ను 6 పరుగులతో ఓడించి సంచలనం సృష్టించింది. తమ దేశంలో ఆ జట్టుకు విశ్వవిజేత స్థాయిలో దేశాధ్యక్షుడి నుంచి స్వాగతం లభించింది.
చిరస్మరణీయ ఇన్నింగ్స్
నిస్సందేహంగా టోర్నీలో సూపర్ స్టార్‌గా నిలిచిన కోహ్లి నుంచి ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో వచ్చింది. 161 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి 3 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ నిలిచింది. ఈ సమయంలో అత్యద్భుత షాట్లతో కోహ్లి గెలిపించిన తీరు అపూర్వం. చివర్లో 11 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో అతను చేసిన 32 పరుగులు, ఆ జోరు మన అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు.