
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి కబడ్డీపై బాగానే ఆసక్తి ఉన్నట్లు ఉంది. ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో భాగంగా శనివారం ముంబై వేదికగా యు ముంబై-పుణె పల్టాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కోహ్లి.. పనిలో పనిగా తన కబడ్డీ జట్టును కూడా ప్రకటించేశాడు. కోహ్లి ఏంటి.. కబడ్డీ ఏంటీ అనుకుంటున్నారా.. ఒకవేళ కబడ్డీ జట్టుకు తాను సారథ్యం వహిస్తే ఎవర్ని ఎంపిక చేస్తాను అనే దానిపై సరదాగా ముచ్చటించాడు. ఇందులో పలువురు భారత క్రికెటర్లను ఎంపిక చేసుకున్నాడు కోహ్లి.
అందులో సహచర ఆటగాడు, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి తొలి ప్రాధాన్యత ఇచ్చాడు. ధోనితో పాటు రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, రిషభ్ పంత్, బుమ్రా, కేఎల్ రాహుల్‌లకు తన జట్టులో చోటిచ్చాడు. వీరిలో ఉమేశ్ యాదవ్, బుమ్రాలు స్పెషలిస్టులుగా కోహ్లి పేర్కొన్నాడు. ఇక క్రికెట్‌ను కబడ్డీని సమాంతరంగా పోల్చితే అంటూ కోహ్లికి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా బదులిస్తూ.. రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్‌ల ప్రస్తావన తీసుకొచ్చాడు. తనకు ధోనికి వారిద్దరూ కాపీలంటూ పేర్కొన్నాడు. ఇక కబడ్డీగురించి మాట్లాడుతూ.. ఈ గేమ్ మన సంస్కృతిలో ఒక భాగమన్నాడు. చిన్నతనంలో మనమంతా ఏదొక సమయంలో కబడ్డీ ఆటను ఎక్కువగా ఆస్వాదించిన వాళ్లమేనని తెలిపాడు. వరల్డ్‌లో మన కబడ్డీ జట్టు అత్యుత్తమ జట్టుగా ఉందంటే దానికి ఆ క్రీడపై మనకున్న మక్కువే కారణమన్నాడు.