కోహ్లి కంటే వారిద్దరే గొప్ప..
కరాచీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి కంటే దిగ్గజ క్రికెటర్లైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లే గొప్ప బ్యాట్స్మెన్ అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్ అభిప్రాయపడ్డాడు. కనీసం వీవీఎస్ లక్ష్మణ్ తో పోల్చదగిన స్థాయి కూడా విరాట్ ఇంకా సంపాదించుకోలేదని యూసఫ్ పేర్కొన్నాడు. ప్రస్తుత క్రికెట్ లో నాణ్యత కొరవడిందన్న యూసఫ్..ప్రధానంగా నాణ్యమైన బౌలర్లే ఇప్పుడు కనబడటం లేదన్నాడు. తాను క్రికెట్ ఆడిన సమయంలో బౌలింగ్ లో క్వాలిటీ ఉండేదన్నాడు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో మెక్ గ్రాత్, షేన్ వార్న్ లతో పాటు, భారత్ లో అనిల్ కుంబ్లే, శ్రీనాథ్ లను యూసఫ్ గుర్తు చేసుకున్నాడు. వారు అద్భుతమైన బౌలర్లని యూసఫ్ కొనియాడాడు. మరొకవైపు ప్రస్తుత పిచ్ లన్నీ ఫ్రెండ్లీ పిచ్ లని.. అవి బ్యాటింగ్ కు ఎక్కువగా అనుకూలిస్తాయన్నాడు. సచిన్, ద్రవిడ్ లు తమ సమయంలో క్లిష్టమైన బౌలర్లను ఎదుర్కొని దిగ్గజ ఆటగాళ్లుగా గుర్తింపు పొందారని.. ఈ నేపథ్యంలో కోహ్లిని వారితో పోల్చకూడదని యూసఫ్ అన్నాడు.