సింగిల్స్‌కోసం కోహ్లీ ఏం చేశాడంటే..?
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలో ఒక్క జుట్టు, గడ్డం విషయంలో తప్ప ఫిట్‌నెస్‌లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించదు. అతడు ఎప్పుడూ చాలా యాక్టీవ్‌గా ఉంటూ ఫుల్ ఎనర్జిటిక్‌గా అదే పర్సనాలిటీతో దర్శనమిస్తుంటాడు. ఇందుకు ప్రధాన కారణం ఈ పరుగుల వీరుడు తాను తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడంట. ఆట ఆడే సమయంలో సింగిల్స్ ఎక్కువగా తీయాలనే ఉద్దేశంతో అందుకు అడ్డుగా ఉన్న బటర్ చికెన్, మటన్ రోల్స్ మొత్తానికి వదిలేశాడంట.
ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీ కోచ్ రాజ్ కుమార్ క్రికెట్ నెక్స్ట్‌తో మాట్లాడుతూ చెప్పారు. ఈ ఢిల్లీ క్రికెటర్ ప్రస్తుతం టీమిండియాలో ఉన్నత శిఖరం అధిరోహించడానికి ప్రతి విషయంలో విరాట్ నిబద్ధతే కారణం అని తెలిపారు. సాధారణంగా కోహ్లీ ఏవైనా సరే తాజాగా ఉండేవి మాత్రమే ఉపయోగిస్తాడని, ఇంటికొచ్చినప్పుడు ప్యాకెట్లలో ఉండే పండ్ల రసాలను ఇస్తే వాటికి నో అని చెప్పి ఇంట్లో పండ్లు ఉంటే వాటిని జ్యూస్‌గా తీసి ఇవ్వండని కోరతాడని చెప్పారు. అలాగే, కోహ్లీ అరటిపండ్లు బాగా తింటాడట. ప్రతి మ్యాచ్ ప్రారంభం సమయంలో కనీసం రెండు మూడు అరటిపండ్లు తింటాడని ఆయన చెప్పుకొచ్చారు.