మ్యాచ్ అనంతరం మాట్లాడుతున్న కోహ్లి
పోర్ట్ ఎలిజబెత్ : సిరీస్ గెలిచాం కదా అని సంబరపడిపోకుండా చివరి వన్డేను సైతం గెలుస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత్ 73 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఒక వన్డే మిగిలుండానే 4-1తో సిరీస్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ఇక మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘ఇది మాకు మరో సమిష్టి ప్రదర్శనతో దక్కిన విజయం. మాపై ఒత్తిడి లేకపోవడంతోనే సిరీస్ గెలిచామనే విషయం అర్థమైంది. ఇది ఓ చరిత్ర. ఆటగాళ్లు చాల కష్టపడ్డారు. జోహన్నెస్‌బర్గ్ టెస్టు విజయం మాలో ఉత్తేజాన్ని కలిగించింది. ఈ విజయానంతరం మేము మా ఆటతీరును సమీక్షించుకున్నాం. అది అలానే కొనసాగిస్తూ 4-1తో సిరీస్ గెలిచి కొత్త చరిత్రను సృష్టించాం. ముఖ్యంగా జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు స్థిరంగా రాణించారు. వారు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. గెలిచాం కదా అని చివరి వన్డేను తేలికగా తీసుకోం. మాకు 5-1తో సిరీస్ గెలవడమే కావాలి. ఇప్పటి వరకు అవకాశం రాని ఆటగాళ్లకు చివరి వన్డేలో రావచ్చు. ఏది ఏమైన గెలవడమే మా ప్రాధాన్యత. దాని కోసం ఏమైనా చేస్తాం’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు.
సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికాలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదించా. క్రికెట్ ఆడటానికి ఇది మంచి ప్రదేశం. నేను నా ఆట శైలి మార్చకున్నా పరుగులు చేయవచ్చని గ్రహించా. నిజంగా ఇది నా రోజు. సెంచరీ సాధించడం ఆనందంగా ఉంది. 17 మంది జట్టు సభ్యుల్లో కేవలం 12 మంది ఆటగాళ్లే ఆడారు. మిగిలిన వారికి చివరి మ్యాచ్‌లో అవకాశం రావోచ్చు. మేం సిరీస్ 5-1తో గెలువాలని కోహ్లి చెప్పాడు. ఇదే ఊపును కొనసాగిస్తూ చివరి వన్డేను సైతం గెలుస్తామని’ రోహిత్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment