సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు రనౌట్ల రికార్డు నమోదు చేశారు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో కోహ్లి రనౌట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య సమన్వయ లోపం మరోసారి చర్చనీయాంశమైంది. వన్డేల్లో వీళ్లిద్దరూ కలిసి ఆడుతున్నపుడు ఎవరో ఒకరు రనౌట్ కావడమిది ఏడోసారి కావడం గమనార్హం. ఏడు రనౌట్లలో కోహ్లీవే ఐదు కాగా.. రెండుసార్లు రోహిత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలా కోహ్లిని రనౌట్ చేసిన ప్రతిసారి హిట్ మ్యాన్ రోహిత్ భారీ స్కోర్లు సాధించాడు. ఇందులో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు (209, 264) నమోదు చేయడం విశేషం. ఐదో వన్డేలో సైతం రోహిత్(115) సెంచరీతో కదం తొక్కాడు.
ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధికంగా రనౌట్లున్న భారత జోడీ సచిన్-గంగూలీలదే. వాళ్లిద్దరి మధ్య 176 భాగస్వామ్యాలు నమోదవగా.. తొమ్మిదిసార్లు ఎవరో ఒకరు రనౌటయ్యారు. ద్రవిడ్-గంగూలీ 87 భాగస్వామ్యాల్లో ఏడు రనౌట్లతో రెండో స్థానంలో ఉండగా.. కోహ్లి-రోహిత్ వారిని సమం చేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. వీళ్లిద్దరి మధ్య 62 భాగస్వామ్యాల్లోనే ఏడు రనౌట్లుండటం విశేషం. గత పదేళ్లలో అత్యధిక రనౌట్లున్న జోడీల్లో వీరిది రెండో స్థానం కాగా డివిలియర్స్-డుప్లెసిస్(8), సంగక్కర- దిల్షాన్(8)లు తొలి స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ 73 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం అందుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment