విరాట్కు ఇప్పుడే కెప్టెన్సీ పగ్గాలు వద్దు
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇప్పుడే పరిమితి ఓవర్ల క్రికెట్లో జట్టు పగ్గాలు అప్పగించరాదని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 'అన్ని ఫార్మాట్లలోనూ విరాట్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించరాదు. కెప్టెన్ పాత్రలో అతన్ని ఎదగనివ్వండి. 2019 వన్డే ప్రపంచ కప్నకు ఇంకా చాలా సమయం ఉంది' అని గవాస్కర్ అన్నాడు.
వచ్చే ప్రపంచ కప్ నాటికి వన్డే జట్టుకు సారథ్యం వహించే సామర్థ్యం మహేంద్ర సింగ్ ధోనీకి ఉండకపోవచ్చని మరో మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అంతేగాక ధోనీ స్థానంలో వన్డే, టి-20 జట్లకు కోహ్లీని కెప్టెన్ చేయాలని సూచించాడు. టెస్టు క్రికెట్ కెప్టెన్గా విరాట్ రాణిస్తున్నాడని కితాబిచ్చాడు. ఈ నేపథ్యంలో గవాస్కర్ స్పందించాడు. ఇప్పుడే కోహ్లీకి అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే ఒత్తిడి పెరుగుతుందన్నది సన్నీ అభిప్రాయం.