టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పాల్గొనాల్సిందని భారత జట్టు మాజీ సారథి సునిల్ గావస్కర్ అన్నాడు. తద్వారా బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు ఈ ఇద్దరు సీనియర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ లభించేదని పేర్కొన్నాడు. అయితే, ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు మాత్రం ఈ రెడ్‌బాల్ టోర్నీ నుంచి విశ్రాంతినిచ్చి మంచి పని చేశారని సెలక్టర్ల నిర్ణయాన్ని గావస్కర్ సమర్థించాడు.
ఆ నలుగురు మినహా
కాగా.. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు.. ఫిట్‌గా ఉన్న సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లంతా దేశవాళీ టోర్నమెంట్లలో ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీలో దాదాపు టీమిండియా ఆటగాళ్లంతా భాగం కానున్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాకు మాత్రం సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు దులిప్ ట్రోఫీ జరుగబోతోంది. కానీ సెలక్టర్లు మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు మినహాయింపు ఇచ్చారు.
తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించేది
నిజానికి ఈ టోర్నీలో ఆడితే బంగ్లాతో సిరీస్‌కు ముందు వారికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించేది. జస్‌ప్రీత్ బుమ్రా వంటి ఫాస్ట్ బౌలర్‌కు విశ్రాంతినిచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతడికి గాయాల ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ బ్యాటర్లకు అలా కాదు. ముఖ్యంగా ముప్పై ఏళ్ల వయసు దాటిన ఏ ఆటగాడైనా సరే ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించడం అవసరం.
ఆ సమస్యలు వస్తాయి
సుదీర్ఘ విరామం తీసుకుని.. ఒకేసారి బరిలోకి దిగితే కండరాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా మ్యాచ్‌లు ఆడితేనే మంచిది’’ అని అభిప్రాయపడ్డాడు. రోహిత్, కోహ్లికి విశ్రాంతినివ్వడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నాడు. కాగా కోహ్లి 2012, రోహిత్ 2016లో చివరగా దేశవాళీ క్రికెట్ ఆడారు.
లంకలో రో‘హిట్’..
ఇక టీ20 ప్రపంచకప్-2024 తర్వాత కోహ్లి- రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం.. శ్రీలంకతో వన్డే సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. అయితే, లంకతో మూడు వన్డేల్లో 37 ఏళ్ల రోహిత్ 58, 64, 35 పరుగులు చేయగా.. 35 ఏళ్ల కోహ్లి మాత్రం 24, 14, 20 రన్స్‌తో పూర్తిగా నిరాశపరిచాడు. కాగా సెప్టెంబరు 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌లో రోహిత్- కోహ్లి ద్వయం మైదానంలో దిగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment