వన్డే ర్యాంకింగులో 3వ స్థానానికి పడిపోయిన విరాట్ కోహ్లీ
వన్డే ర్యాంకింగులలో భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగులను దుబాయ్లో మంగళవారం ప్రకటించింది. ఇంతకుముందు రెండో స్థానంలో కోహ్లీ ఉండగా.. ఇప్పుడు ఆ స్థానంలోకి దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ హషీం ఆమ్లా వచ్చాడు. అయితే.. నవంబర్ రెండో తేదీ నుంచి శ్రీలంకతో జరగనున్న ఐదు మ్యాచ్ల సిరీస్ రూపంలో కోహ్లీకి తన స్థానాన్ని మెరుగు పరుచుకోడానికి మరో అవకాశం ఉంది. ఆమ్లాకు, కోహ్లీకి మధ్య కేవలం రెండు రేటింగ్ పాయింట్లు మాత్రమే తేడా ఉంది. మొదటి ర్యాంకులో దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డీవీలియర్స్ ఉన్నాడు. భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఆరో స్థానాన్ని యథాతథంగా నిలుపుకొన్నాడు. అయితే శిఖర్ ధవన్ మాత్రం తొమ్మిదో స్థానానికి పడిపోయాడు.
ఇక బౌలర్ల విషయానికొస్తే.. ఆరు, ఏడు స్థానాల్లో భారత బౌలర్లు రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ యథాతథంగా ఉన్నారు. పాకిస్థాన్ బౌలర్ సయీద్ అజ్మల్ తన మొదటి స్థానాన్ని నిలుపుకొన్నాడు. ప్రపంచ ఛాంపియన్లు గా ఉన్న భారత జట్టు నెంబర్ 3లోనే కొనసాగగా, దక్షిణాఫ్రికా మాత్రం ఐదేళ్ల తర్వాత మళ్లీ వన్డేలలో టాప్ ర్యాంకును సాధించింది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా కంటే ఒక్క రేటింగ్ పాయింటు తేడాతో ఆస్ట్రేలియా నిలిచింది. ఇంతకుముందు 2009 సెప్టెంబర్ నెలలో ఒక్కసారి దక్షిణాఫ్రికాకు నెంబర్ 1 స్థానం లభించినా, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ తొలి రౌండులోనే వెనుదిగడంతో ఆస్ట్రేలియాకు ఆ స్థానం అప్పగించేసింది.