విరాట్ కోహ్లి రికార్డును సవరించిన కివీస్ క్రికెటర్ (PC: White Ferns)
న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ సుజీ బేట్స్ చరిత్ర సృష్టించింది. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కివీస్ మహిళా జట్టు.. ప్రొటిస్ మహిళా జట్టుతో ఆదివారం ఐదో టీ20లో తలపడింది.
ఇందులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో కివీస్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది.
ఓపెనర్ కేట్ ఆండర్సన్ 11 పరుగులకే పెవిలియన్ చేరినప్పటికీ మరో ఓపెనర్ సుజీ బేట్స్(45)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ అమీలియా కెర్(61) జోరును కొనసాగించింది. కానీ సుజీ అవుటైన తర్వాత అమీలియాకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు.
మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ మొత్తం సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో అమీలియా ఆఖరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసిన కివీస్ మహిళా జట్టు 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఇక వర్షం కారణంగా తొలి మూడు టీ20లలో ఫలితం తేలకపోవడంతో.. నాలుగు, ఐదు మ్యాచ్‌లలో గెలిచిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా సిరీస్‌ను 1-1తో పంచుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా సుజీ బేట్స్ అరుదైన ఘనత సాధించింది. 42 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 45 పరుగులు రాబట్టిన ఈ కుడిచేతి వాటం గల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అంతర్జాతీయ టీ20లలో సరికొత్త రికార్డు నమోదు చేసింది.
ఇప్పటి వరకు మొత్తంగా 149 టీ20లు ఆడిన సుజీ బేట్స్ దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా 4021 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో రన్‌మెషీన్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేసింది. కాగా కోహ్లి 115 మ్యాచ్‌లలో 37 అర్ధ శతకాలు, ఒక సెంచరీ సాయంతో 4008 పరుగులు చేశాడు.
తన ఖాతాలోనూ ఓ శతకంతో పాటు 26 హాఫ్ సెంచరీలు జమ చేసుకున్న సుజీ ఈ మేరకు కోహ్లి రికార్డును సవరించింది. ఈ సందర్భంగా కివీస్ మహిళా జట్టును సూచించే వైట్‌ఫెర్న్స్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసింది.
‘‘సరికొత్త చరిత్ర! బెనోనీలో జరిగిన మ్యాచ్‌లో సుజీ బేట్స్.. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఘనత సాధించింది.
అంతేకాదు.. విరాట్ కోహ్లి(4008*)ని అధిగమించి ప్రస్తుతం ప్రపంచంలోనే టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది’’ అని సుజీకి శుభాకాంక్షలు తెలియజేసింది.
కాగా పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ 3405 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. భారత జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ 3154 రన్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: Ind vs Pak: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వి.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు?
History made! Suzie Bates became the first woman to reach 4000 T20I career runs today in Benoni🏏 Suzie is now the leading T20I run scorer in the world, surpassing previous record holder Virat Kohli (4008*) 🌏 #SAvNZ #CricketNation pic.twitter.com/SjqcBNRQmS
— WHITE FERNS (@WHITE_FERNS) October 15, 2023
Comments
Please login to add a commentAdd a comment