T20 Internationals
-
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఆసియా-పసిఫిక్ క్వాలిఫైయర్-ఏ పోటీల్లో భాగంగా సమోవా దేశంతో జరిగిన మ్యాచ్‌లో వనుఅటు దేశ సీమర్ నలిన్ నిపికో ఒకే ఓవర్లో 39 పరుగులు సమర్పించుకున్నాడు. నిపికో బౌలింగ్‌లో సమోవా దేశ బ్యాటర్ డేరియస్ విస్సర్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. నిపికో మూడు నో బాల్స్ వేశాడు. ఫలితంగా ఓ ఓవర్లో 39 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఇది సరికొత్త ప్రపంచ రికార్డు.2007 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, 2021లో శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయ, 2024 ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ టీ20 టోర్నీలో ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ ఒకే ఓవర్లో 36 పరుగులు (6 సిక్సర్లు) సమర్పించుకున్నారు. బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్, ధనంజయ బౌలింగ్‌లో కీరన్ పోలార్డ్, కమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో దీపేంద్ర సింగ్ ఎయిరీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్ల ఘనత సాధించారు.మొత్తం 14 సిక్సర్లు..నిపికో బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన డేరియస్ విస్సర్.. ఇన్నింగ్స్ మొత్తంలో ఏకంగా 14 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో 62 బంతుల్లో 132 పరుగులు చేసిన విస్సర్.. సమోవా దేశం తరఫున శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. -
విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన కివీస్ క్రికెటర్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా..
న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ సుజీ బేట్స్ చరిత్ర సృష్టించింది. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కివీస్ మహిళా జట్టు.. ప్రొటిస్ మహిళా జట్టుతో ఆదివారం ఐదో టీ20లో తలపడింది. ఇందులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో కివీస్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ కేట్ ఆండర్సన్ 11 పరుగులకే పెవిలియన్ చేరినప్పటికీ మరో ఓపెనర్ సుజీ బేట్స్(45)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ అమీలియా కెర్(61) జోరును కొనసాగించింది. కానీ సుజీ అవుటైన తర్వాత అమీలియాకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ మొత్తం సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో అమీలియా ఆఖరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసిన కివీస్ మహిళా జట్టు 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక వర్షం కారణంగా తొలి మూడు టీ20లలో ఫలితం తేలకపోవడంతో.. నాలుగు, ఐదు మ్యాచ్‌లలో గెలిచిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా సిరీస్‌ను 1-1తో పంచుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా సుజీ బేట్స్ అరుదైన ఘనత సాధించింది. 42 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 45 పరుగులు రాబట్టిన ఈ కుడిచేతి వాటం గల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అంతర్జాతీయ టీ20లలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పటి వరకు మొత్తంగా 149 టీ20లు ఆడిన సుజీ బేట్స్ దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా 4021 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో రన్‌మెషీన్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేసింది. కాగా కోహ్లి 115 మ్యాచ్‌లలో 37 అర్ధ శతకాలు, ఒక సెంచరీ సాయంతో 4008 పరుగులు చేశాడు. తన ఖాతాలోనూ ఓ శతకంతో పాటు 26 హాఫ్ సెంచరీలు జమ చేసుకున్న సుజీ ఈ మేరకు కోహ్లి రికార్డును సవరించింది. ఈ సందర్భంగా కివీస్ మహిళా జట్టును సూచించే వైట్‌ఫెర్న్స్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసింది. ‘‘సరికొత్త చరిత్ర! బెనోనీలో జరిగిన మ్యాచ్‌లో సుజీ బేట్స్.. అంతర్జాతీయ టీ20 కెరీర్లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఘనత సాధించింది. అంతేకాదు.. విరాట్ కోహ్లి(4008*)ని అధిగమించి ప్రస్తుతం ప్రపంచంలోనే టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది’’ అని సుజీకి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ 3405 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. భారత జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ 3154 రన్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: Ind vs Pak: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వి.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? History made! Suzie Bates became the first woman to reach 4000 T20I career runs today in Benoni🏏 Suzie is now the leading T20I run scorer in the world, surpassing previous record holder Virat Kohli (4008*) 🌏 #SAvNZ #CricketNation pic.twitter.com/SjqcBNRQmS — WHITE FERNS (@WHITE_FERNS) October 15, 2023 -
అరుదైన క్లబ్లో చేరిన టీమిండియా క్రికెటర్
Smriti Mandhana: టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధన ఓ అరుదైన క్లబ్లో చేరింది. ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా థాయ్‌లాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 10) జరిగిన మ్యాచ్‌లో ఆడటం ద్వారా మంధన 100 అంతర్జాతీయ టీ20లు పూర్తి చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా, నాలుగో టీమిండియా క్రికెటర్‌గా (పురుషులతో కలిపి), ఓవరాల్‌గా 37వ అంతర్జాతీయ క్రికెటర్‌గా (పురుషులు, మహిళలతో కలిపి) రికార్డుల్లోకెక్కింది. భారత మహిళల క్రికెట్లో మంధనకు ముందు ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక్కరే 100 మ్యాచ్‌ల ఫీట్ సాధించారు. హర్మన్ 135 మ్యాచ్‌ల్లో సెంచరీ, 8 హాఫ్ సెంచరీల సాయంతో 2647 పరుగులు సాధించగా.. మంధన 100 మ్యాచ్‌ల్లో 17 అర్ధసెంచరీల సాయంతో 2373 పరుగులు స్కోర్ చేసింది. పురుషుల క్రికెట్ కూడా కలుపుకుంటే భారత్ తరఫున ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారధి విరాట్ కోహ్లి మాత్రమే 100 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నారు. హిట్‌మ్యాన్ ఇప్పటివరకు అత్యధికంగా (పురుషులు, మహిళa క్రికెట్లో ఇదే అత్యధికం) 142 టీ20లు ఆడగా.. విరాట్ 109 మ్యాచ్‌లు ఆడాడు. ఇక మహిళల క్రికెట్లో అత్యధిక టీ20లు ఆడిన రికార్డు న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ పేరిట ఉంది. ఆమె మొత్తం 136 మ్యాచ్‌లు ఆడింది. ఇక ఇవాళ థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి ధాటికి ప్రత్యర్ధి చిగురుటాకులా వణికిపోయింది. 15.1 ఓవర్లు ఆడిన థాయ్ జట్టు కేవలం 37 పరుగులకే కుప్పకూలింది. ఆతర్వాత భారత్ కేవలం 6 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
India vs South Africa 3rd T20: చివరిది వదిలేశారు.. పోరాడకుండానే..
ఇండోర్: టీమిండియా టి20 ప్రపంచకప్ సన్నాహకం పరాజయంతో ముగిసింది. మెగా టోర్నీకి ముందు ఆడిన చివరి పోరులో భారత్ ఓటమి పాలైంది. ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న దక్షిణాఫ్రికా మూడో టి20లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చి 49 పరుగులతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. రిలీ రోసో (48 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ టి20ల్లో తొలి సెంచరీ సాధించగా... డికాక్ (43 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. అనంతరం భారత్ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ కార్తీక్ (21 బంతుల్లో 46; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), దీపక్ చహర్ (17 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. భారత్ ఈ సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. భారీ భాగస్వామ్యాలు... కెప్టెన్ బవుమా (3) పేలవ ఫామ్ కొనసాగగా, మరో ఓపెనర్ డికాక్ మొదటి నుంచే ధాటిగా ఆడాడు. మూడో స్థానంలో వచ్చి రోసో కూడా దూకుడు కనబర్చడంతో దక్షిణాఫ్రికా వేగంగా పరుగులు రాబట్టింది. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 48 పరుగులకు చేరింది. అశ్విన్ బౌలింగ్‌లో రోసో (వ్యక్తిగత స్కోరు 24) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీపై సిరాజ్ అందుకోలేకపోగా, అది సిక్స్‌గా మారింది. మరోవైపు ఉమేశ్ బౌలింగ్‌లో సిక్స్‌తో 33 బంతుల్లో డికాక్ అర్ధసెంచరీ పూర్తయింది. రెండో వికెట్‌కు 47 బంతుల్లో 89 పరుగులు జోడించిన తర్వాత డికాక్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం రోసో 27 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చహర్, హర్షల్ ఓవర్లలో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన 90ల్లోకి చేరిన రోసో... చివరి ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. చహర్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు బాది డేవిడ్ మిల్లర్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌కు ఘనమైన ముగింపునిచ్చాడు. పోరాడకుండానే... 8 ఓవర్లు ముగిసేసరికి ఐదుగురు బ్యాటర్లు పెవిలియన్‌కు... క్రీజ్‌లో ఇద్దరు బౌలర్లు అక్షర్, హర్షల్! ఛేదనలో భారత జట్టు పరిస్థితి ఇది. ఓపెనర్‌గా వచ్చిన ‘బర్త్‌డే బాయ్’ పంత్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కార్తీక్ క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు (20 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యం) టీమిండియాకూ విజయవకాశాలు ఉన్నాయని అనిపించింది. గత మ్యాచ్‌లో భారీ లక్ష్యమే అయినా దక్షిణాఫ్రికా పోరాడిన తరహాలో భారత్ కూడా చెలరేగవచ్చని భావించినా అది సాధ్యం కాలేదు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (రనౌట్) 68; బవుమా (సి) రోహిత్ (బి) ఉమేశ్ 3; రోసో (నాటౌట్) 100; స్టబ్స్ (సి) అశ్విన్ (బి) చహర్ 23; మిల్లర్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–30, 2–120, 3–207. బౌలింగ్: చహర్ 4–0–48–1, సిరాజ్ 4–0–44–0, అశ్విన్ 4–0– 35–0, ఉమేశ్ 3–0–34–1, హర్షల్ 4–0–49–0, అక్షర్ 1–0–13–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) రబడ 0; పంత్ (సి) స్టబ్స్ (బి) ఇన్‌గిడి 27; శ్రేయస్ (ఎల్బీ) (బి) పార్నెల్ 1; కార్తీక్ (బి) మహరాజ్ 46; సూర్యకుమార్ (సి) స్టబ్స్ (బి) ప్రిటోరియస్ 8; అక్షర్ (సి) డి కాక్ (బి) పార్నెల్ 9; హర్షల్ (సి) మిల్లర్ (బి) ఇన్‌గిడి 17, అశ్విన్ (సి) రబడ (బి) మహరాజ్ 2, చహర్ (సి) మిల్లర్ (బి) ప్రిటోరియస్ 31; ఉమేశ్ (నాటౌట్) 20; సిరాజ్ (సి) మిల్లర్ (బి) ప్రిటోరియస్ 5; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 178. వికెట్ల పతనం: 1–0, 2–4, 3–45, 4–78, 5–86, 6–108, 7–114, 8–120, 9–168, 10–178. బౌలింగ్: రబడ 4–0–24–1, పార్నెల్ 4–0–41–2, ఇన్‌గిడి 3–0–51–2, మహ రాజ్ 4–0–34–2, ప్రిటోరియస్ 3.3–0–26–3. -
కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ 'తోపు'.. టీమిండియా కెప్టెన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు
వ్యక్తిగత ప్రదర్శన విషయం అటుంచితే.. కెప్టెన్‌గా మాత్రం రోహిత్ శర్మ రెచ్చిపోతున్నాడు. ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలు సాధిస్తూ.. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. తాజాగా పాక్‌పై (ఆసియా కప్ 2022) విజయంతో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 30 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన కెప్టెన్లలో అత్యధిక విన్నింగ్ పర్సంటేజ్ (83.33) కలిగిన సారధిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. Win% of T20I Captains with 30 or more Wins83.3% Rohit Sharma80.8% Asghar Afghan62.5% Virat Kohli59.2% Eoin Morgan58.6% MS Dhoni55.6% Aaron Finch51.7% Kane Williamson#RohitSharma | #AsiaCup | #Hitman— Cricbaba (@thecricbaba) August 29, 2022 రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 36 మ్యాచ్‌ల్లో 83.33 విజయాల సగటుతో 30 మ్యాచ్‌లు గెలుపొందింది. రోహిత్ సారధ్యంలో భారత్ కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. ఈ జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్ఘాన్ ఉన్నాడు. కెప్టెన్‌గా అఫ్ఘాన్ విజయాల శాతం 80.8గా ఉంది. ఆ తరువాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (62.5%), ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (59.2%), టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (58.6%), ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (55.6%), న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51.7%) వరుసగా ఉన్నారు. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన హైఓల్టేజీ పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో భారత్..దాయాదిపై పూర్తి ఆధిపత్యం చలాయించి విజేతగా నిలిచింది. హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించగా.. భువీ, కోహ్లి, జడేజాలు జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: 'పంత్‌ను కాదని కార్తీక్‌ను ఆడించడం సరైన నిర్ణయం' -
ఇలాంటి మ్యాచ్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్
నేపియర్: న్యూజిలాండ్‌తో రెండో టి20లో ఛేదనకు బంగ్లాదేశ్ బరిలోకి దిగింది. కానీ ఎన్ని పరుగులు చేస్తే గెలుస్తామో తెలీదు! దానిపై స్పష్టత లేకుండానే అంపైర్లు ఆట మొదలు పెట్టేశారు. వర్షం బారిన పడిన మ్యాచ్‌లో మైదానంలోని పెద్ద స్క్రీన్‌పై, కివీస్ అధికారిక ట్విట్టర్లో 16 ఓవర్లలో 148గా చూపించారు. 9 బంతులు పడిన తర్వాత హడావిడిగా మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో కంప్యూటర్‌తో కుస్తీ పట్టి డక్‌వర్త్ లూయిస్ లెక్క ప్రకారం లక్ష్యాన్ని 16 ఓవర్లలో 170గా తేల్చాడు. ఆ వెంటనే కాదు కాదు అంటూ నాలుక్కర్చుకొని చివరకు 171 పరుగులుగా ఖరారు చేశారు! ‘డక్‌వర్త్’ ఎంత గందరగోళమో, చివరకు మ్యాచ్ రిఫరీలకు కూడా అర్థం కానిదని ఈ ఘటన నిరూపించింది. సాధారణ వర్ష సూచన ఉన్నప్పుడు ఓవర్లు, వికెట్ల ప్రకారం చేయాల్సిన లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఇన్నింగ్స్ విరామం మధ్యలో ఇరు జట్లకు ఒక షీట్‌ను అందిస్తారు. సరిగ్గా లెక్క చేయలేక వాటిని ఇవ్వకపోవడంతో ఇదంతా జరిగి నిర్వహణా లోపాన్ని చూపించింది. చివరకు జెఫ్ క్రో ఇరు జట్లకు క్షమాపణలు చెప్పుకున్నాడు! ఈ మ్యాచ్‌లో కివీస్ 28 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గి 2–0తో సిరీస్ దక్కించుకుంది. ముుందుగా కివీస్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. వర్షం రావడంతో ఇన్నింగ్స్‌ను ముగించారు. ఫిలిప్స్ (58 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ (34 నాటౌట్ ; 6 ఫోర్లు) రాణించారు. బంగ్లాదేశ్ 16 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది. చదవండి: (క్వారంటైన్ కలిపింది ఆ ఇద్దరినీ...) (ఐపీఎల్ 2021: పంజాబ్ పదునెంత?) -
2015 తర్వాత తొలి ‘టై’ 20
డెవెంటర్: అంతర్జాతీయ టీ 20 చరిత్రలో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. స్కాట్లాండ్-ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ టై ముగిసి రికార్డు పుస్తకాల్లోకెక్కింది. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నాల్గో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా, ఆ తర్వాత లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఐర్లాండ్ సైతం 185 పరుగులకే పరిమితమైంది. దాంతో మ్యాచ్ టైగా ముగిసింది. కాగా, ఇలా ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఫలితం తేలకుండా టై ముగియడం 2015 తర్వాత ఇదే తొలిసారి. మూడేళ్ల క్రితం ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ చివరిసారి టైగా ముగియగా, ఆపై ఇంతకాలానికి మరొక టీ 20 మ్యాచ్‌లో ఫలితం రాకపోవడం గమనార్హం. ఆరు టీ20ల సిరీస్‌లో భాగంగా తాజా మ్యాచ్‌లో స్కాట్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్కాట్లాండ్ ఆటగాళ్లలో జార్జ్ మున్సే(46), కోయిట్జర్(54), మెక్‌లీయాడ్(46)లు రాణించారు. అటు తర్వాత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐర్లాండ్ దూకుడుగా ఆడింది. ప్రధానం ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(81; 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. దాంతో ఐర్లాండ్ విజయం సాధించడం ఖాయంగానే కనబడింది. అయితే స్కాట్లాండ్ బౌలర్లు చివర్లో కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఐర్లాండ్ గెలుపుకు పరుగు ముందు ఆగిపోయి టైతో సరిపెట్టుకుంది. -
కోహ్లి@ నంబర్ వన్
దుబాయ్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్‌లో విశేషంగా రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఈ సిరీస్ ద్వారా 47 రేటింగ్ పాయింట్లను సాధించిన కోహ్లి మొత్తంగా 892 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. సోమవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తాజాగా విడుదల చేసిన టీ 20 ర్యాంకింగ్స్ లో ఆసీస్ టీ 20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ ను కోహ్లి వెనక్కునెట్టి ప్రథమ స్థానంలో నిలిచాడు. తొలి మ్యాచ్ లో 90 నాటౌట్, రెండో మ్యాచ్‌లో 59 నాటౌట్, మూడో మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన కోహ్లి ఒక ద్వైపాక్షిక టీ 20 సిరీస్ లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఇదిలా ఉండగా, ఈ సిరీస్ లో 44, 74 పరుగులతో రాణించిన ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ 14 రేటింగ్ పాయింట్లను మాత్రమే సాధించి 868 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇతర టీమిండియా ఆటగాళ్లలో సురేష్ రైనా మూడు స్థానాలకు ఎగబాకి 13 వ స్థానానికి చేరగా, రోహిత్ శర్మ నాలుగ స్థానాలను మెరుగుపరుచుకుని 16వ స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ ట్వంటీ 20 ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్ స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ 20 గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ధోని సేన ఎనిమిదో స్థానం నుంచి ఒక్కసారిగా పైకి ఎగబాకి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టీమిండియా 120 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, ఆస్ట్రేలియా 110 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. మిగతా జట్లలో విండీస్ రెండో స్థానంలో, శ్రీలంక మూడో స్థానంలో, ఇంగ్లండ్ నాల్గో స్థానంలో కొనసాగుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ లు వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలవగా, ఆప్ఘానిస్తాన్ తొమ్మిది, స్కాట్లాండ్ పదో స్థానంలో ఉన్నాయి.