కోహ్లి@ నంబర్ వన్ | virat kohli replaces Finch as No 1 batsman in T20 Internationals | Sakshi
Sakshi News home page

కోహ్లి@ నంబర్ వన్

Published Mon, Feb 1 2016 2:32 PM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

కోహ్లి@ నంబర్ వన్

కోహ్లి@ నంబర్ వన్

దుబాయ్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్లో విశేషంగా రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఈ సిరీస్ ద్వారా 47 రేటింగ్ పాయింట్లను సాధించిన కోహ్లి మొత్తంగా 892 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.  సోమవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తాజాగా విడుదల చేసిన టీ 20 ర్యాంకింగ్స్ లో  ఆసీస్ టీ 20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ ను కోహ్లి వెనక్కునెట్టి  ప్రథమ స్థానంలో నిలిచాడు. తొలి మ్యాచ్ లో 90 నాటౌట్, రెండో మ్యాచ్లో 59 నాటౌట్, మూడో మ్యాచ్లో 50 పరుగులు చేసిన కోహ్లి ఒక ద్వైపాక్షిక టీ 20 సిరీస్ లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఇదిలా ఉండగా, ఈ సిరీస్ లో 44, 74 పరుగులతో రాణించిన ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ 14 రేటింగ్ పాయింట్లను మాత్రమే సాధించి 868 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇతర టీమిండియా ఆటగాళ్లలో సురేష్ రైనా మూడు స్థానాలకు ఎగబాకి 13 వ స్థానానికి చేరగా, రోహిత్ శర్మ నాలుగ స్థానాలను మెరుగుపరుచుకుని 16వ స్థానంలో నిలిచాడు.


అంతర్జాతీయ ట్వంటీ 20 ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్ స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ 20 గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ధోని సేన ఎనిమిదో స్థానం నుంచి ఒక్కసారిగా పైకి ఎగబాకి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టీమిండియా 120 పాయింట్లతో  ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, ఆస్ట్రేలియా 110 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. మిగతా జట్లలో విండీస్ రెండో స్థానంలో, శ్రీలంక మూడో స్థానంలో, ఇంగ్లండ్ నాల్గో స్థానంలో కొనసాగుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ లు వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలవగా, ఆప్ఘానిస్తాన్ తొమ్మిది, స్కాట్లాండ్ పదో స్థానంలో ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement