టీమిండియాలో ముసలం?
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ కోచ్ అనిల్ కుంబ్లేపై కెప్టెన్ కోహ్లి, కొందరు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారా?. తాజా రిపోర్టులు ఈ విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. కోహ్లికి దగ్గరి వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. కుంబ్లే టీంను గైడ్ చేసే పద్దతిపై కెప్టెన్ కోహ్లితో పాటు కొందరు సినీయర్లు గుర్రుగా ఉన్నారని చెప్పారు. దీంతో ప్లేయర్లను శాంతిపజేసేందుకు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లు రంగంలోకి దిగినట్లు వెల్లడించారు.
కుంబ్లే వర్కింగ్ స్టైల్ కంటే రవిశాస్త్రి వర్కింగ్ స్టైల్‌ను ప్లేయర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు సమాచారం. కోచ్‌పై ఆటగాళ్ల అసంతృప్తి గురించి సీఓఏ వినోద్‌రాయ్ ముగ్గురు సభ్యుల కమిటీతో చర్చించనున్నట్లు తెలిసింది. అయితే, కుంబ్లేకు ఆటగాళ్లకు మధ్య సమస్య ఇంకా గాలివానగా మారలేదు. దీంతో సమస్యను పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం ఈ సమస్యపై గంగూలీతో కోహ్లీ మాట్లాడినట్లు తెలిసింది. వాస్తవానికి కుంబ్లేను కోచ్‌గా కొనసాగించాలని బీసీసీఐ భావించినా.. కోహ్లీ అందుకు నిరాకరించినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోపి ముగిసిన అనంతరం కుంబ్లే కాంట్రాక్టు పూర్తవనుంది. కొత్త టీమిండియా కోచ్‌కు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, కొత్త కోచ్ ఎంపిక జరిగే వరకూ కుంబ్లేను బీసీసీఐ కోచ్‌గా కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సీఓఏ ప్రత్యక్షంగా టీంను పర్యవేక్షించలేదు కాబట్టి కొత్త కోచ్‌ను ముగ్గురు సభ్యుల కమిటీనే ఎన్నుకుంటుందని సమాచారం. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని సెహ్వాగ్‌ను కొందరు కోరగా, వీరూ అందుకు నిరాకరించినట్లు తెలిసింది. రవిశాస్త్రి కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కనబరచలేదు. ఆస్ట్రేలియా ప్లేయర్ టామ్ మూడీ కోచ్ పదవికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రిమూర్తుల్లో ఒకరైన రాహుల్ ద్రవిడ్ కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కీలక చాంపియన్స్ ట్రోఫి ముందు ఆటగాళ్లు, కోచ్ మధ్య విభేదాలు తలెత్తయనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.