హైదరాబాద్: క్రికెట్ రికార్టులు తిరగరాయటమే అలవాటుగా మార్చుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లి మరిన్ని రికార్డులపై కన్నేశాడు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. అయితే ఆసీస్ గడ్డపై అరుదైన రికార్డును సాధించేందుకు టీమిండియా పరుగుల యంత్రం కోహ్లి మరో రెండు సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆసీస్‌లో ఐదు టెస్టు శతకాలు సాధించి లెజండర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత సిరీస్‌లో మరో రెండు సెంచరీలు సాధిస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(6) రికార్డును అధిగమించే అవకాశం ఉంది.
ఇక క్రికెట్ గాడ్ టెస్టుల్లో ఆసీస్‌లో సాధించిన పరుగుల రికార్డును కూడా కోహ్లి తిరగరాసే అవకాశం ఉంది. సచిన్ ఆసీస్ పిచ్‌లపై 20 టెస్టుల్లో 1809 పరుగుల సాధించగా.. కోహ్లి ఎనిమిది టెస్టుల్లోనే 992 పరుగులు సాధించాడు. దీంతో ఈ సిరీస్‌లో మరో 817 పరుగులు సాధిస్తే సచిన్ రికార్డును అధిగమిస్తాడు. భీకరఫామ్‌లో ఉన్న టీమిండియా రన్ మిషన్ ఈ రికార్డులు సాధించడం సులువే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో (205) పది వేల పరుగుల మైలురాయిని చేరిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (259 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును కోహ్లి అధిగమించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment