అతనితో జాగ్రత్త: కోహ్లి హెచ్చరిక
పుణె: ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ స్టార్క్ ప్రమాదకర బౌలర్. ఎటువంటి పిచ్ల్లోనైనా బంతిని బాగా స్వింగ్ చేయగల సమర్ధుడు. గతేడాది శ్రీలంకతో సిరీస్ లో భాగంగా అక్కడ స్పిన్ పిచ్లపై కూడా స్టార్క్ 24 వికెట్లతో మెరిశాడు. ఆ సిరీస్ లో ఆసీస్ వైట్ వాష్ అయినప్పటికీ స్టార్క్ మాత్రం స్పిన్ పిచ్లపై అమోఘంగా రాణించాడు. ఇప్పుడు మన పిచ్ లు కూడా స్పిన్ కు అనుకూలించే పిచ్ లే అయినప్పటికీ, స్టార్క్ తో జాగ్రత్తగా ఉండాలని అంటున్నాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి.
ఆసీస్ స్టార్ బౌలర్ స్టార్క్ ను ఏమాత్రం తక్కువ అంచనా వేసిన తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని సహచరుల్ని కోహ్లి హెచ్చరించాడు. ' స్టార్క్ ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. ఆ విషయం మనకందరికీ తెలుసు. ఇటీవల కాలంలో స్టార్క్ ను గాయాలు వేధిస్తున్నా, అతనొక ప్రమాదకర బౌలర్. స్టార్క్ నమోదు చేసిన గణాంకాలే అతని ప్రదర్శనను తెలియజేస్తున్నాయి. అతనొక అసాధారణ బౌలర్. పాత బంతితో రివర్స్ స్వింగ్ చేయడంలో స్టార్క్ దిట్ట. ప్రతీరోజు అతని ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్న బౌలర్. అటు కొత్త బంతితోనే కాదు.. బంతి పాత బడే కొద్ది కూడా స్టార్క్ ప్రమాదమే. ఒక్కసారిగా గేమ్ ను మార్చే సత్తా స్టార్క్ లో ఉంది. అతని బౌలింగ్ ను తేలిగ్గా తీసుకోవద్దు'అని జట్టు సహచరుల్ని కోహ్లి హెచ్చరించాడు.