అష్గబాత్ (తుర్క్‌మెనిస్తాన్): ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్–విజయ్ నటరాజన్ (భారత్) ద్వయం 6–3, 6–4తో డెనిస్ యెవ్‌సెయెవ్–తిముర్ (కజకిస్తాన్) జంటపై విజయం సాధించింది. మహిళల డబుల్స్ విభాగంలో అంకిత రైనా–ప్రార్థన తొంబారే (భారత్) జోడీకి రజత పతకం లభించింది.
ఫైనల్లో అంకిత–ప్రార్థన జంట 6–3, 3–6, 6–7 (5/7)తో తమాచాన్–వరుణ్య (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల గ్రీకో రోమన్ 130 కేజీల విభాగంలో నవీన్, 85 కేజీల విభాగంలో రవీందర్ ఖత్రీ రజత పతకాలు గెలిచారు. ఫైనల్లో నవీన్ 0–2తో బెహనామ్ (ఇరాన్) చేతిలో, రవీందర్ 1–4తో అజీజీ సమన్ (ఇరాన్) చేతిలో ఓడిపోయారు. నేటితో ముగియనున్న ఈ క్రీడల్లో ఇప్పటివరకు భారత్ 8 స్వర్ణాలు, 11 రజతాలు, 17 కాంస్యాలతో కలిపి మొత్తం 36 పతకాలతో 11వ స్థానంలో ఉంది.