ఆనంద్‌కు ‘లండన్’ టైటిల్
లండన్: నాటకీయ పరిణామాల నడుమ భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో తొలిసారి విజేతగా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ టోర్నీలో ఆనంద్ 7 పాయింట్లతో వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), అనీష్ గిరి (నెదర్లాండ్స్)లతో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాడు. చివరిదైన ఐదో రౌండ్‌లో ఆనంద్ నల్లపావులతో ఆడుతూ 36 ఎత్తుల్లో మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్)పై గెలుపొందగా... క్రామ్నిక్, అనీష్ గిరిల మధ్య జరిగిన గేమ్ 63 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది.
దాంతో విజేతను నిర్ణయించడానికి ఈ ముగ్గురి మధ్య సూపర్ టైబ్రేక్ స్కోరును పరిగణనలోకి తీసుకున్నారు. ఈ టోర్నీలో నల్ల పావులతో గేమ్‌లు నెగ్గిన వారికి సూపర్ టైబ్రేక్ స్కోరింగ్ నిబంధన అనుకూలిస్తుంది. ఆనంద్ నల్లపావులతో విజయం సాధించగా... క్రామ్నిక్, అనీష్ గిరి (రెండో రౌండ్‌లో) తెల్లపావులతో నెగ్గారు. దీంతో ఆనంద్‌కు టైటిల్ ఖాయమైంది.
ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఐదు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో గేమ్ గెలిస్తే మూడు పాయింట్లు... ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్ లభిస్తాయి. ఆనంద్, క్రామ్నిక్, అనీష్ గిరి నాలుగేసి గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక్కో గేమ్‌లో గెలిచారు. అయితే నల్లపావులతో నెగ్గడం ఆనంద్‌కు కలిసొచ్చింది. ఆనంద్‌కు 50 వేల యూరోలు (రూ. 39 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీగా లభించింది.