
కొత్త చరిత్ర దిశగా...
ఒకరిదేమో అరంగేట్రం స్థాయి... మరొకరిదేమో ‘ఫిఫా’ ర్యాంకింగ్‌లో రెండో స్థానం. కొత్త చరిత్ర కోసం ఒకరు... పాత చరిత్రను తిరగరాయడానికి మరొకరు.
* నేడు బెల్జియంతో వేల్స్ క్వార్టర్స్ పోరు
* బేల్‌పైనే అందరి దృష్టి
* యూరో కప్
లిల్లీ: ఒకరిదేమో అరంగేట్రం స్థాయి... మరొకరిదేమో ‘ఫిఫా’ ర్యాంకింగ్‌లో రెండో స్థానం. కొత్త చరిత్ర కోసం ఒకరు... పాత చరిత్రను తిరగరాయడానికి మరొకరు. ఈ నేపథ్యంలో యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు (శుక్రవారం) జరగనున్న క్వార్టర్స్ పోరులో కొత్త కూన వేల్స్‌తో.... రెండో ర్యాంకర్ బెల్జియం అమీతుమీకి సిద్ధమైంది.
అర్హత పోటీల్లో అద్భుతమైన ఆటతీరుతో తొలిసారి యూరోకప్‌కు అర్హత సాధించిన వేల్స్... లీగ్, ప్రిక్వార్టర్స్‌లోనూ అంచనాలకు మించి రాణించింది. నార్తర్న్ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆఖరి నిమిషాల్లో ఒత్తిడిని జయించి గెలవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని ఆమాంతం పెంచింది. దీంతో క్వార్టర్స్‌లోనూ అదే స్థాయిలో ఆడాలని పట్టుదలగా ఉంది. అలాగే 1958 ప్రపంచకప్ తర్వాత ఓ మేజర్ టోర్నీలో వేల్స్ బరిలోకి దిగడం ఇదే మొదటిసారి కావడంతో గెలుపుతో కొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తోంది.
దీనికోసం ఏడాది కిందట క్వాలిఫయింగ్ టోర్నీలో బెల్జియంపైనే ఏకైక గోల్ సాధించిన ఫ్రికిక్ నిపుణుడు గ్యారెత్ బేల్‌పైనే జట్టు మరోసారి భారీ ఆశలు పెట్టుకుంది. అయితే బెల్జియం దాడులను నిలువరించాలంటే వేల్స్ రక్షణశ్రేణితో పాటు గోల్ కీపర్ హెన్నెసే శక్తికి మించి రాణించాలి.
మరోవైపు స్టార్ ఆటగాళ్లతో కూడిన బెల్జియం ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. లీగ్ దశలో రెండు మ్యాచ్‌లే గెలిచినా.. ప్రిక్వార్టర్స్‌లో హంగేరిపై నాలుగు గోల్స్‌తో తమ సత్తా ఏంటో చూపెట్టింది. వ్యూహాలను రచించడం, అమలు చేయడంలో కోచ్ విల్‌మోట్స్ దిట్ట. యూరోలో 1980లో రన్నరప్‌గా నిలిచిన బెల్జియం ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ లీగ్ తొలి మ్యాచ్‌లోనే ఇటలీలాంటి మేటి జట్టుపై గెలవడంతో ఇప్పుడు టైటిల్‌పై ఆశలు పెట్టుకుంది. వేల్స్‌తో పోలిస్తే అన్ని రంగాల్లో మెరుగ్గా ఉన్న బెల్జియంకు స్టార్ స్ట్రయికర్ ఈడెన్ హజార్డ్ కొండంత అండ. చివరి నిమిషాల్లో తన స్ట్రయికింగ్‌తో మ్యాచ్ ఫలితాలను తారుమారు చేయడం ఇతని ప్రత్యేకత. టోబీ, విర్‌మాలెన్, లుకాక్, మునేర్‌లూ రాణిస్తే వేల్స్‌కు కష్టాలు తప్పవు.