ప్లీజ్.. ఆటగాళ్లను అవమానించొద్దు : కోహ్లీ
ప్రపంచంలో క్రీడల పోటీలు అనగానే మొదటగా గుర్తొచ్చేది ఒలింపిక్స్. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఈ గేమ్స్ లో తమను తాము నిరూపించుకోవడంతో పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకాలు కొల్లగొట్టాలని ప్రతి క్రీడాకారుడు భావిస్తాడు. అందుకే దేశం కోసం ఏదైనా చేయాలని తపించే ఆటగాళ్లను మనం గౌరవించాలని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ముందుగా మనం ఒలింపిక్స్ లాంటి అత్యున్నత క్రీడల పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లు ఎంతో కష్టపడి సాధన చేస్తారని, వారి లక్ష్యం కచ్చితంగా పతకమే అయ్యుంటుందని పేర్కొన్నాడు.
ఒలింపిక్స్ లాంటి గేమ్స్ లో ఆడుతున్నందుకు మన ఆటగాళ్లను చూసి గర్వపడాలని వారికి కోహ్లీ మద్ధతుగా నిలిచాడు. ఇటీవల కొందరు రియోలో పాల్గొన్న భారత ఆటగాళ్లను విమర్శస్తూ ట్వీట్లు, కామెంట్ చేయడంపై కోహ్లీ స్పందించాడు. విండీస్ పై సిరీస్ విజయాన్ని సాధించిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. కొందరు అథ్లెట్లు, ఇతర ఆటగాళ్లను చులకన చేసి మాట్లాడుతున్నారని, అయితే ఆ వ్యాఖ్యలు వారిని మరింత కుంగదీస్తాయని అభిప్రాయపడ్డాడు. దేశం తరఫున అత్యున్నత ప్రాతినిధ్యం వహించే వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. మనం దేశం నుంచి వారికి అండగా నిలవాలని.. వారికి విజయాలు చేకూరాలని ఆకాంక్షించాలని సూచించాడు.