ఇంగ్లండ్ సాకర్ స్టార్ వేన్ రూనీ ఆల్ టైమ్ గ్రేట్ రికార్డుకు మూడడుగుల దూరంలో ఉన్నాడు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ఫుట్‌బాల్ సీజన్‌లో భాగంగా శనివారం అర్సెనల్‌తో మ్యాచ్ నేపథ్యంలో ఈ మూడు గోల్స్ సాధిస్తే సర్ బాబీ చార్ల్ టన్ 249 గోల్స్ రికార్డును రూనీ అధిగమిస్తాడు. కొత్త మేనేజర్ నేతృత్వంలో జట్టు బాగా సిద్ధమైందన్న రూనీ ఈ సీజన్‌లో తమ మాంచెస్టర్ యునెటైడ్ పుంజుకుంటుందని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే...
మాంచెస్టర్‌కు కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ రేసులో నిలుస్తారా?
మాకిది చాలెంజింగ్ సీజన్. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి పుంజుకుంటామన్న నమ్మకముంది. కొన్ని నెలలుగా మేనేజర్ మౌరిన్హో జట్టును బాగా తీర్చిదిద్దారు. జట్టు కూర్పు కూడా బాగుంది. మైదానంలో మా ఆటను చూసి మీరు అదే చెప్తారు.
ఈ మ్యాచ్‌లో తుది జట్టులో మీకు అవకాశముంటుందా?
నేను బరిలోకి దిగుతాననే భావిస్తున్నా. కానీ ఇది ఫుట్‌బాల్. ఒక్కోసారి బెంచ్‌కే పరిమితమవ్వొచ్చు. అరుుతే ఇప్పుడు మాత్రం నేను ప్రాక్టీసులో చాలా బాగా చెమటోడ్చాను. తప్పకుండా ఆడతాననే అనుకుంటున్నాను.
మీపై తరచూ వచ్చే విమర్శల్ని వింటే మీకేమనిపిస్తుంది?
నేను ముందుగా నా కోచ్ సూచనల్ని వింటాను. జట్టు సహచరుల మాటలు వింటా. నా చుట్టూ మిగతా వాళ్లేమంటారో పట్టించుకోను. చాలా సందర్భాల్లో అర్థంలేని విమర్శలే ఎక్కుపెడతారని నాకనిపిస్తుంది. ఆటలో గెలుపోటములు సహజం. గెలిచినప్పుడు ఓ రకంగా... ఓడితే మరో రకంగా స్పందించాల్సిన అవసరం నాకు లేదు.
బరిలో దిగేటప్పుడు మీరే స్థానంలో ఆడాలని కోరుకుంటారు?
నేనిదివరకే ఎన్నోసార్లు ఈ ప్రశ్నకు బదులిచ్చాను. ఇపుడు మళ్లీ అదే చెబుతున్నాను. మ్యాచ్ సమయానికి మేనేజర్ ఏ స్థానంలో ఆడమంటే ఆ స్థానంలో ఆడతాను. ఇప్పటి వరకు నన్ను ఏ జట్టు కూడా ప్రత్యేకించి ఈ స్థానం కోసమని తీసుకోలేదు. ఇప్పటికే ఎన్నో స్థానాల్లో ఆడాను. మైదానంలో ఏ పొజిషన్‌కై నా నేను సిద్ధమనే నాకనిపిస్తుంది. (ఈపీఎల్ సీజన్ నేపథ్యంలో రూనీ ఇంటర్వూ ‘సాక్షి’కి ప్రత్యేకం)