
నా తొలి టెస్టే.. అతనికి చివరి టెస్టు..
బెంగళూరు: భారత క్రికెట్ ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లే ఎంపిక కావడం నిజంగా తమకు దక్కిన సువర్ణావకాశమని ఓపెనర్ మురళీ విజయ్ తెలిపాడు. ఆ దిగ్గజ ఆటగాడు దగ్గర్నుంచి అనేక విషయాలను నేర్చుకోవడానికి భారత క్రికెట్ జట్టు ఎదురుచూస్తుందన్నాడు. తాను కుంబ్లేకు పెద్ద అభిమానినని పేర్కొన్న విజయ్.. అతను భారత్ క్రికెట్ ను మరింత ముందుకు తీసుకువెళ్తాడన్నాడు.
' నేను యువకుడిగా ఉన్న దగ్గర్నుంచీ కుంబ్లేకు పెద్ద అభిమానిని. అయినప్పటికీ నేను కుంబ్లేతో ఎక్కువ సమయం గడపే అవకాశం రాలేదు. నా తొలి టెస్టు మ్యాచే.. అతనికి చివరి టెస్టు మ్యాచ్ అయ్యింది. అందుచేత అతనితో ఎక్కువగా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని పంచుకోలేదు. మరొకసారి అతనితో కలిసి భాగస్వామ్యం అయ్యే అవకాశం లభించింది. అతని ఎంపిక భారత జట్టుకు లభించిన గొప్ప వరం. యువ క్రికెటర్లు కుంబ్లే నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు'అని మురళీ విజయ్ తెలిపాడు. గతంలో టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రితో కొన్ని అద్భుతమైన క్షణాలను ఆస్వాదించినట్లు విజయ్.. ఇప్పుడు కుంబ్లే రూపంలో ఒక గొప్ప కోచ్ వచ్చాడన్నాడు.