
ప్రసాదంలా పంచుతున్నారు
క్రీడా అవార్డులపై మిల్కాసింగ్ వ్యాఖ్య
బెంగళూరు: దేశంలో క్రీడల అవార్డులకు విలువ లేకుండా చేస్తున్నారని, ఎవరికి పడితే వాళ్లకు అవార్డులను ప్రసాదంలా పంచుతున్నారని భారత అథ్లెటిక్ దిగ్గజం మిల్కాసింగ్ ధ్వజమెత్తారు. ‘ఒలింపిక్స్, ఆసియాగేమ్స్, కామన్వెల్త్ క్రీడల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అవార్డులు ఇవ్వాలి. ఈసారి అర్జున అవార్డుల ఎంపిక మరీ అన్యాయంగా ఉంది’ అని మిల్కా అన్నారు.
తన జీవిత కాలంలో ఒలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్‌లో పతకం చూడలేనేమో అని అన్నారు. ‘వికాస్ గౌడ, క్రిష్ణ పూనియాల ప్రయత్నాలను నేను తక్కువ చేయడం లేదు. కానీ ఒలింపిక్స్‌లో పతకం సాధించటానికి మన ప్రమాణాలు సరిపోవడం లేదు. ఆ దిశగా మన ప్రయత్నాలు సాగుతున్నాయని కూడా అనుకోవడం లేదు’ అని మిల్కాసింగ్ వ్యాఖ్యానించారు.