మానసికంగా అలసిపోయాం
అయినా శక్తి మేర పోరాడుతున్నాం
రాయుడు వ్యాఖ్య
మిర్పూర్: కిక్కిరిసిన అంతర్జాతీయ షెడ్యూల్ వల్ల భారత జట్టులోని కొంత మంది ఆటగాళ్లు మానసికంగా అలసిపోయారని అంబటి తిరుపతి రాయుడు అన్నాడు. ‘దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనల నుంచి నేరుగా బంగ్లాదేశ్ వచ్చాం. కివీస్ నుంచి వచ్చిన రెండు రోజులకే బంగ్లాతో తొలి మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. దీనికి తోడు ఆటగాళ్లు కూడా మానసికంగా బాగా అలసిపోయారు. ఇతర జట్లతో పోలిస్తే మేం చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ అలసట ప్రభావం ఎక్కువగా ఉంటోంది.
గతేడాది నవంబర్ నుంచి కోహ్లి విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడటం కూడా దెబ్బతీస్తోంది. ఐదు రోజుల్లో మూడు మ్యాచ్‌లు ఆడాం. ఇలాంటి సమయంలో ఏ జట్టు కూడా వెంటవెంటనే ప్రాక్టీస్‌లో పాల్గొనదు’ అని రాయుడు వివరించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్ మేనేజ్‌మెంట్ మంచి తోడ్పాటు అందిస్తోందని చెప్పాడు. భారత ఆటగాళ్లు సరిగా ప్రాక్టీస్ చేయడం లేదని గవాస్కర్ విమర్శించారు. ఈ నేపథ్యంలో రాయుడు ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. మ్యాచ్ గెలిచేందుకు జట్టు సభ్యులంతా చాలా తీవ్రంగా కష్టపడుతున్నారని రాయుడు తెలిపాడు. అదృష్టం కలిసిరాకే రెండు మ్యాచ్‌లు ఓడామన్నాడు.