సొహైల్ వికెట్ తీసిన ఆనందంలో రసెల్, విండీస్ సభ్యుల సంబరం
ప్రపంచ కప్‌లో ప్రేక్షకులు హోరాహోరీ సమరాలు మాత్రమే చూడాలి, ఏకపక్ష మ్యాచ్‌లు ఉండరాదని చిన్న జట్లకు చోటు లేకుండా చేశాం. తాజా వరల్డ్ కప్ గురించి ఐసీసీ ఇచ్చుకున్న వివరణ ఇది. అయితే పది జట్ల పోరులో కూడా చెత్త ప్రదర్శన సాధ్యమేనని చూపించిన పాకిస్తాన్ ఆట ఐసీసీకి కూడా షాక్ ఇచ్చి ఉంటుంది! ఏమాత్రం వెన్నెముక లేని బ్యాటింగ్‌తో వరల్డ్ కప్ బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్ బౌలింగ్ ముందు కుదేలైంది.
ఆడుతోంది వన్డేనా, టి20 మ్యాచా కూడా అర్థం చేసుకోలేని రీతిలో కేవలం 21.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నాటితరం తమ పేసర్లను గుర్తుకు తెచ్చే విధంగా ఈతరం విండీస్ బౌలర్లు వరుసగా షార్ట్‌పిచ్ బంతులతో చెలరేగడంతో బెంబేలెత్తిపోయిన పాక్ చేతులెత్తేసింది. పాక్ ప్రపంచ కప్‌లో తమ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేయగా... 36.2 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన విండీస్ వరల్డ్‌కప్‌లో రికార్డు స్థాయిలో అతి పెద్ద విజయాన్ని అందుకుంది.
నాటింగ్‌హామ్: సరిగ్గా రెండు వారాల క్రితం ఇదే మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో పాకిస్తాన్ 340 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. పాక్ ఆటతీరు ఎలాంటిదో చెప్పే విధంగా ఇప్పుడు ఆ జట్టు మరో ఉదాహరణను చూపించింది. వంద పరుగులు దాటడమే కష్టమై తమ అనిశ్చితిని మరోసారి ప్రదర్శించింది. శుక్రవారం ఇక్కడి ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 21.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్), బాబర్ ఆజమ్ (33 బంతుల్లో 22; 2 ఫోర్లు) టాప్ స్కోరర్లు కాగా మరో ఇద్దరు రెండంకెల స్కోరు దాటారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఒషాన్ థామస్ (4/27) ప్రత్యర్థిని కుప్పకూల్చగా... హోల్డర్ 3, రసెల్ 2 వికెట్లు తీశారు. అనంతరం విండీస్ 13.4 ఓవర్లలో 3 వికెట్లకు 108 పరుగులు చేసి విజయాన్నందుకుంది. క్రిస్ గేల్ (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తనదైన శైలిలో చెలరేగగా, నికోలస్ పూరన్ (19 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ఆమిర్‌కే 3 వికెట్లు దక్కాయి.
టపటపా...
తన రెండో ఓవర్లో ఇమామ్ ఉల్ హఖ్ (2)ను ఔట్ చేసి కాట్రెల్ పాక్ పతనానికి శ్రీకారం చుట్టగా, ఆ తర్వాత విండీస్ పేసర్లు తమ పదునైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. 10 ఓవర్లు ముగిసేసరికి పాక్ 45 పరుగులు చేసింది. 12 పరుగుల వద్ద హెట్‌మైర్ క్యాచ్ వదిలేసినా బాబర్ ఆజమ్ దానిని పెద్దగా వాడుకోలేకపోయాడు. కీపర్ హోప్ అద్భుత క్యాచ్‌తో అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత హోల్డర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి పాక్‌ను మళ్లీ దెబ్బ తీశాడు. ముందుగా కీపర్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి సర్ఫరాజ్ (8) వెనుదిరిగాడు. బంతి బ్యాట్‌కు తగల్లేదని భావించి అంపైర్ నాటౌట్‌గా ప్రకటించగా... విండీస్ రివ్యూ కోరి ఫలితం సాధించింది. అదే ఓవర్లో షార్ట్ బంతిని ఆడలేక ఇమాద్ (1) పెవిలియన్ చేరాడు. మరో ఆరు పరుగుల వ్యవధిలో షాదాబ్ (0), హసన్ అలీ (1), హఫీజ్ (16) పెవిలియన్ చేరడంతో పాక్ స్కోరు 83/9 వద్ద నిలిచింది. వంద పరుగులు దాటడం కూడా కష్టమే అనిపించిన స్థితిలో వహాబ్ రియాజ్ (18) కొన్ని పరుగులు జత చేశాడు. హోల్డర్ వేసిన ఓవర్లో అతను 2 సిక్సర్లు, ఫోర్ కొట్టడం విశేషం. చివరకు వహాబ్‌ను థామస్ క్లీన్ బౌల్డ్ చేసి పాక్ ఆట ముగించాడు.
గేల్ జోరు...
అతి స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ తక్కువ వ్యవధిలోనే హోప్ (11), డారెన్ బ్రేవో (0) వికెట్లు కోల్పోయింది. అయితే గేల్ మాత్రం అభిమానులను ఆనందపర్చడంలో విఫలం కాలేదు. అతని దెబ్బకు పేసర్ హసన్ అలీ బిత్తరపోవాల్సి వచ్చింది. హసన్ అలీ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను... హసన్ తర్వాతి ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు, మూడో ఓవర్లో కూడా మరో రెండు ఫోర్లు బాదాడు. తన తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసి ఆత్మవిశ్వాసం ప్రదర్శించిన వహాబ్ రియాజ్ రెండో ఓవర్లో వరుసగా 6, 4, 4 బాది గేల్ దూకుడు ప్రదర్శించాడు. 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం గేల్‌ను ఆమిర్ వెనక్కి పంపగా, మిగిలిన పనిని పూరన్ పూర్తి చేశాడు. వహాబ్ ఓవర్లో 4, 6 కొట్టిన పూరన్... అదే బౌలర్ మరుసటి ఓవర్లో మరో ఫోర్, సిక్స్ దంచి మ్యాచ్‌ను గెలిపించాడు.
రసెల్ 18 బంతుల్లో...
ఇది చూడగానే ఎప్పటిలాగే చెలరేగి ఏ 50 పరుగులో చేసి ఉంటాడు అనే ఆలోచన రావడం సహజం. కానీ ఈసారి మాట్లాడుతోంది అతని బౌలింగ్ గురించి! బ్యాటిం గ్‌లో ఆండ్రీ రసెల్ విధ్వంసం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు... ఇటీవల ఐపీఎల్‌లో అతని మెరు పులు చూశాం. కానీ శుక్రవారం పాక్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లో రసెల్ బౌలింగ్ ఒక అద్భుతం. షార్ట్...షార్ట్...షార్ట్... దాదాపు 146 కిలోమీటర్ల వేగంతో వరుసగా షార్ట్ పిచ్ బంతులు విసిరి అతను పాక్ బ్యాట్స్‌మెన్‌ను ఒక ఆటాడుకున్నాడు. ఎక్కడా వేగం తగ్గకుండా, కచ్చితత్వంతో, నిలకడగా షార్ట్ బంతులు వేయడంలో అతని అసాధారణ ప్రతిభ కనిపించింది.
రసెల్ వేసిన 18 బంతుల్లో 15 బంతులు షార్ట్ పిచ్‌వే కావడం విశేషం! అతని మూడు ఓవర్ల స్పెల్ పాక్‌లో భయం పుట్టించింది. రసెల్ తొలి ఓవర్లో బౌన్సర్‌ను ఫఖర్ జమాన్ ఆడలేకపోయాడు. అతని హెల్మెట్ గ్రిల్‌కు తగిలి బంతి వికెట్లపై పడింది. రెండో ఓవర్లో షార్ట్ బంతులను ఆడలేక బాబర్ బెదిరిపోయాడు. మెయిడిన్‌గా ముగిసిన మూడో ఓవర్లో ఎత్తులో వేగంగా దూసుకొచ్చిన బంతిని ఆడలేక సొహైల్ వికెట్ సమర్పించుకున్నాడు. 3 ఓవర్లలో కేవలం 4 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన రసెల్ బౌలింగ్ ప్రదర్శన రాబోయే రోజుల్లో ప్రత్యర్థులకు ప్రమాద హెచ్చరికగా చెప్పవచ్చు.
స్కోరు వివరాలు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఇమామ్ ఉల్ హక్ (సి) హోప్ (బి) కాట్రెల్ 2; ఫఖర్ జమాన్ (బి) రసెల్ 22; బాబర్ ఆజమ్ (సి) హోప్ (బి) థామస్ 22; సొహైల్ (సి) హోప్ (బి) రసెల్ 8; సర్ఫరాజ్ (సి) హోప్ (బి) హోల్డర్ 8; హఫీజ్ (సి) కాట్రెల్ (బి) థామస్ 16; ఇమాద్ (సి) గేల్ (బి) హోల్డర్ 1; షాదాబ్ (ఎల్బీ) (బి) థామస్ 0; హసన్ అలీ (సి) కాట్రెల్ (బి) హోల్డర్ 1; రియాజ్ (బి) థామస్ 18; ఆమిర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 4;
మొత్తం (21.4 ఓవర్లలో ఆలౌట్) 105.
వికెట్ల పతనం: 1–17, 2–35, 3–45, 4–62, 5–75, 6–77, 7–78, 8–81, 9–83, 10–105.
బౌలింగ్: కాట్రెల్ 4–0–18–1; హోల్డర్ 5–0–42–3; రసెల్ 3–1–4–2; బ్రాత్‌వైట్ 4–0–14–0; థామస్ 5.4–0–27–4.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (సి) షాదాబ్ (బి) ఆమిర్ 50; హోప్ (సి) హఫీజ్ (బి) ఆమిర్ 11; డారెన్ బ్రేవో (సి) ఆజమ్ (బి) ఆమిర్ 0; పూరన్ (నాటౌట్) 34; హెట్‌మైర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (13.4 ఓవర్లలో 3వికెట్లకు) 108.
వికెట్ల పతనం: 1–36, 2–46, 3–77.
బౌలింగ్: ఆమిర్ 6–0–26–3; హసన్ అలీ 4–0–39–0; రియాజ్ 3.4–1–40–0.
ఫఖర్ జమాన్ బౌల్డ్
Comments
Please login to add a commentAdd a comment