ఆసీస్‌...ఆసీసే! | Australia beat West Indies by 15 runs at Cricket World Cup 2019 | Sakshi
Sakshi News home page

ఆసీస్‌...ఆసీసే!

Published Fri, Jun 7 2019 4:01 AM | Last Updated on Fri, Jun 7 2019 8:35 AM

Australia beat West Indies by 15 runs at Cricket World Cup 2019 - Sakshi

ఎంతైనా ఆస్ట్రేలియా... ఆస్ట్రేలియానే! మొదట వెస్టిండీస్‌ పేసర్ల దెబ్బకు కుదేలైనా గొప్పగా తేరుకుంది. అనంతరం కీలక సమయంలో కరీబియన్లకు ముకుతాడు వేసి మ్యాచ్‌ను వశం చేసుకుంది. మొత్తంగా తమనెందుకు ప్రొఫెషనల్‌ జట్టు అంటారో చాటింది. తామెంత బలంగా ఉన్నామో చాటుతూ పరోక్షంగా ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిందీ డిఫెండింగ్‌ చాంపియన్‌. మ్యాచ్‌లో 8వ నంబరు బ్యాట్స్‌మన్‌ కూల్టర్‌ నైల్‌ (60 బంతుల్లో 92; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అసాధారణ ఇన్నింగ్స్‌ ఓ విశేషమైతే... స్టీవ్‌ స్మిత్‌ సాధికారిక ఇన్నింగ్స్‌... పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (5/46) ఐదు వికెట్ల గణాంకాలు మరో మెరుపు ప్రదర్శన. పాపం... వెస్టిండీస్‌! అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో పైచేయి సాధించినట్లే సాధించి పట్టు విడిచిపెట్టి పరాజయం పాలైంది. వారి పేసర్ల ప్రతాపం మరుగున పడిపోయింది.  

నాటింగ్‌హామ్‌: మ్యాచ్‌ను అదుపులోకి తెచ్చుకోవడం ఎలాగో, ప్రత్యర్థికి కళ్లెం వేయడం ఎలాగో చూపుతూ వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 15 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కూల్టర్‌ నైల్, మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (103 బంతుల్లో 73; 7 ఫోర్లు), వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ (55 బంతుల్లో 45; 7 ఫోర్లు) రాణించారు. కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (3/67) మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కీపర్‌ షై హోప్‌ (105 బంతుల్లో 68; 7 ఫోర్లు), నికొలస్‌ పూరన్‌ (36 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ హోల్డర్‌ (57 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్‌) రాణించినా... మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం... ఆసీస్‌ బౌలర్లు స్టార్క్, కమిన్స్‌ (2/41) పదునైన బంతులకు విండీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 273 పరుగులే చేయగలిగింది.  

చెదిరిన ఇన్నింగ్స్‌ను నిలిపారు...
థామస్‌ లయ తప్పడంతో తొలి ఓవర్లోనే ఆసీస్‌కు 10 పరుగులొచ్చాయి. ఈ ఆనందం కాసేపే. భీకర వేగంతో మరుసటి ఓవర్లో థామస్‌ ప్రతాపం చూపాడు. గుడ్‌ లెంగ్త్‌లో ఆఫ్‌ స్టంప్‌పై వేసిన రెండో బంతికి కెప్టెన్‌ ఫించ్‌ (6) వెనుదిరగ్గా,  కాట్రెల్‌ బౌన్సర్‌ను స్క్వేర్‌ డ్రైవ్‌ ఆడబోయి మరో ఓపెనర్‌ వార్నర్‌ (3) వెనుదిరిగాడు. రసెల్‌... ఖాజా పనిపట్టాడు. మ్యాక్స్‌వెల్‌ (0)ను ఖాతా తెరవకుండానే కాట్రెల్‌ ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 38/4. ఈ దశలో స్మిత్, స్టొయినిస్‌ (19; 4 ఫోర్లు) నిలిచి 41 పరుగులు జోడించారు. స్టొయినిస్‌ను హోల్డర్‌ పెవిలియన్‌ చేర్చడంతో కంగారూలు మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు. ఈ దశలో స్మిత్, క్యారీ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. స్కోరు పైకి వెళ్తున్న క్రమంలో క్యారీని ఔట్‌ చేసి 68 పరుగుల ఆరో వికెట్‌ భాగస్వామ్యానికి రసెల్‌ ముగింపు పలికాడు.

కథ మార్చిన కూల్టర్‌ నైల్‌...
ఈ దశలో ఆసీస్‌ 200 చేసినా గొప్పే అనుకుంటుండగా ఉరుము లేని పిడుగులా వచ్చి పడ్డాడు కూల్టర్‌ నైల్‌. తొలి రెండు బంతులకు దాదాపు ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న అతడు అనంతరం గేరు మార్చుకుంటూ పోయాడు. అంతకుముందు తమ బ్యాటింగ్‌ లైనప్‌ను కూల్చిన బౌలర్లలో ఎవరినీ లెక్కచేయకుండా షాట్లు కొట్టాడు. అవతలి ఎండ్‌లో 77 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న స్మిత్‌... కూల్టర్‌ నైల్‌కు ఎక్కువగా స్ట్రయికింగ్‌ వచ్చేలా చూశాడు. 41 బంతుల్లో కూల్టర్‌ కెరీర్‌ తొలి అర్ధ సెంచరీ అందుకున్నాడు. సెంచరీ ఖాయమనుకుంటుండగా 49వ ఓవర్లో భారీషాట్‌కు యత్నించి లాంగాఫ్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. ఇదే ఓవర్లో స్టార్క్‌ (8) కూడా ఔటవడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

కాట్రెల్‌... ఓ అద్భుత క్యాచ్‌
ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో కాట్రెల్‌ పట్టిన స్మిత్‌ క్యాచ్‌ అద్భుతం అని చెప్పాలి. 44వ ఓవర్‌ రెండో బంతిని థామస్‌ ఫుల్‌ లెంగ్త్‌లో వికెట్లకు దూరంగా వేయగా స్మిత్‌ తనదైన శైలిలో లాంగ్‌ లెగ్‌లోకి షాట్‌ ఆడాడు. అంతా అది సిక్స్‌ అని భావించారు. కానీ, 20 గజాల దూరం నుంచి పరిగెత్తుకు వచ్చిన కాట్రెల్‌ ఎడమ చేతితో బంతిని మెరుపులా అందుకున్నాడు. రోప్‌కు అతి సమీపంలో ఉండటంతో గాల్లోకి ఎగరేశాడు. అనంతరం లైన్‌ దాటి వచ్చి క్యాచ్‌ పట్టాడు.


విండీస్‌ ఆడినట్లే...ఆడి!
విండీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లలో లూయిస్‌ (1), గేల్‌ (21; 4 ఫోర్లు) త్వరగానే ఔటయ్యారు. హోప్‌ మూడో వికెట్‌కు పూరన్‌ తో 68 పరుగులు, నాలుగో వికెట్‌కు హెట్‌మైర్‌ (21; 3 ఫోర్లు)తో 50 పరుగులు జోడించి కరీబియన్లను పోటీలోకి తెచ్చాడు. సమన్వయం కొరవడి హెట్‌మైర్‌ రనౌటవడం దెబ్బకొట్టింది. హోల్డర్, హోప్‌ 46 బంతుల్లో 41 పరుగులు జత చేసి ఆశలు రేపారు. 90 బంతుల్లో 99 చేయాల్సిన స్థితిలో హోప్‌ ఔటయ్యాడు. రసెల్‌ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు, సిక్స్‌) రెచ్చిపోతున్నాడనగా స్టార్క్‌ యార్కర్‌ లెంగ్త్‌ బంతితో బలిగొన్నాడు. ఈ క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్‌ చక్కగా అందుకున్నాడు. 46వ ఓవర్‌ చివరి బంతికి హోల్డర్‌ ఔటవడంతో విండీస్‌ పోరాటం ఓటమిలో పరుగుల అంతరాన్ని తగ్గించేందుకే అన్నట్లయింది.
 


స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) హెట్‌మైర్‌ (బి) కాట్రెల్‌ 3; ఫించ్‌ (సి) హోప్‌ (బి) థామస్‌ 6; ఖాజా (సి) హోప్‌ (బి) రసెల్‌ 13; స్మిత్‌ (సి) కాట్రెల్‌ (బి) థామస్‌ 73; మ్యాక్స్‌వెల్‌ (సి) హోప్‌ (బి) కాట్రెల్‌ 0; స్టొయినిస్‌ (సి) పూరన్‌ (బి) హోల్డర్‌ 19; క్యారీ (సి) హోప్‌ (బి) రసెల్‌ 45; కూల్టర్‌ నైల్‌ (సి) హోల్డర్‌ (బి) బ్రాత్‌వైట్‌ 92; కమిన్స్‌ (సి) కాట్రెల్‌ (బి) బ్రాత్‌వైట్‌ 2; స్టార్క్‌ (సి) హోల్డర్‌ (బి) బ్రాత్‌వైట్‌ 8; జంపా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్‌) 288. 

వికెట్ల పతనం: 1–15, 2–26, 3–36, 4–38, 5–79, 6–147, 7–249, 8–268, 9–284, 10–288. 

బౌలింగ్‌: థామస్‌ 10–0–63–2, షెల్డన్‌ కాట్రెల్‌ 9–0–56–2, రసెల్‌ 8–0–41–2, బ్రాత్‌వైట్‌ 10–0–67–3, హోల్డర్‌ 7–2–28–1, ఆష్లే నర్స్‌ 5–0–31–0.  

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: గేల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్‌ 21; లూయిస్‌ (సి) స్మిత్‌ (బి) కమిన్స్‌ 1; హోప్‌ (సి) ఖాజా (బి) కమిన్స్‌ 68; పూరన్‌ (సి) ఫించ్‌ (బి) జంపా 40; హెట్‌మైర్‌ (రనౌట్‌) 21; హోల్డర్‌ (సి) జంపా (బి) స్టార్క్‌ 51; రసెల్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) స్టార్క్‌ 15; బ్రాత్‌వైట్‌ (సి) ఫించ్‌ (బి) స్టార్క్‌ 16; ఆష్లే నర్స్‌ (నాటౌట్‌) 19; కాట్రెల్‌ (బి) స్టార్క్‌ 1; థామస్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 273.

వికెట్ల పతనం: 1–7, 2–31, 3–99, 4–149, 5–190, 6–216, 7–252, 8–252, 9–256.

బౌలింగ్‌: స్టార్క్‌ 10–1–46–5, కమిన్స్‌ 10–3– 41–2, కూల్టర్‌ నైల్‌ 10–0–70–0, మ్యాక్స్‌వెల్‌ 6–1–31–0, జంపా 10–0–58–1, స్టొయినిస్‌ 4–0–18–0. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement