నాలుగేళ్ల తర్వాత గెలిచింది!
బాసెటెరీ (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్): వన్డేల్లో నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం సాధించింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరిగిన ఐదో వన్డేలో ఆసీస్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. 266 పరుగుల లక్ష్యాన్ని 45.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మార్లన్ శామ్యూల్స్(92, 87 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత పోరాటానికి తోడు చార్లెస్(48), బ్రావో(39) రాణించడంతో విండీస్ విజయాన్ని అందుకుంది. రామదిన్ 29, ఫ్లెచర్ 27 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్-నీల్, జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఫాల్కనర్ ఒక వికెట్ తీశాడు.
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కంగారు టీమ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా(98) తృటిలో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్ స్మిత్(74), బెయిలీ(55) అర్ధ సెంచరీలతో రాణించారు. ఫించ్ డకౌటయ్యాడు. విండీస్ బౌలర్లలో హొల్డర్, బ్రాత్ వైట్, పొలార్డ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. శామ్యూల్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు.