
అంతా అనుకున్నట్లే టెస్టు సిరీస్ ముగిసింది. రెండో టెస్టులో మూడో రోజు తొలి సెషన్ మినహా అంతా భారత్ ఆధిపత్యంలోనే సాగింది. మనవాళ్లెక్కడా ఇబ్బంది పడలేదు. ఒత్తిడిని ఎదుర్కొనలేదు. రెండు టెస్టుల్ని మూడు రోజుల్లోనే ముగించారు. కానీ అప్పట్లో... 1960 దశకంలో వెస్టిండీస్... భారత్ సహా ఇతర ప్రత్యర్థి జట్లను ఇలాగే మూడు రోజుల్లోనే మట్టికరిపించేది. ఇప్పుడేమో ఆ పరిస్థితి తారుమారైంది. అయితే వన్డేల్లోనైనా రాణించేందుకు వెస్టిండీస్ ప్రయత్నించాలి. కానీ కొందరు కీలక ఆటగాళ్లు గైర్హాజరీ కావడమో లేదంటే ఇతర దేశాల్లో జరిగే టి20 లీగ్‌ల్లో ఆడటం జరుగుతోంది. దీంతో బలమైన జట్టు బరిలోకి దిగలేకపోతోంది. మరోవైపు భారత్ మంచి ఫామ్‌లో ఉంది.
విజయాల ఊపులో ఉన్న ఈ జట్టు తమ రిథమ్‌ను కొనసాగించాలనుకుంటుంది. భారత జట్టులోని కొత్త కుర్రాళ్లకు ఈ సిరీస్ చక్కని అవకాశం. దీన్ని వాళ్లంతా సద్వినియోగం చేసుకోవాలి. ఆసియా కప్‌కు విశ్రాంతి తీసుకున్న భారత కెప్టెన్ కోహ్లి శతకాలు బాదేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలి. ఫామ్‌లో ఉన్న రోహిత్, శిఖర్ ధావన్‌లు కెప్టెన్‌కు ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం ఇస్తారో అనేది కూడా ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే ఈ వన్డే సిరీస్ కూడా ఏకపక్షంగానే అనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెస్టిండీస్ ఆటగాళ్లు ప్రతిఘటిస్తే... పోటీ తప్ప పరాజయం ఎదురయ్యే పరిస్థితి అయితే భారత్‌కు లేదు.