తొలి టీ 20లో భారత్ ఓటమి
మూలపాడు(విజయవాడ):వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ 20లో భారత మహిళలు ఓటమి పాలయ్యారు. భారత విసిరిన 151 పరుగుల లక్ష్యాన్నివిండీస్ ఐదు వికెట్లతో తేడాతో ఛేదించింది. విండీస్ కెప్టెన్ స్టెఫనీ టేలర్(90;51 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద మాథ్యూస్(18) వికెట్ ను కోల్పోయినా, టేలర్ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో అలరించింది. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ సాధించిన టేలర్.. విండీస్ విజయాన్ని దాదాపు ఖరారు చేసిన తరువాత పెవిలియన్ చేరింది. ఇక ఆ తరువాత విండీస్ వికెట్లు కోల్పోయినప్పటికీ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగా గెలుపొందింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేశారు. వేదా కృష్ణమూర్తి(50),హర్మన్ ప్రీత్ కౌర్(68 నాటౌట్)లు హాఫ్ సెంచరీలు సాధించారు.