ఎదురులేని భారత్
బ్యాంకాక్:మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భారత్ జోరు కొనసాగుతోంది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక మహిళల్ని 69 పరుగులకే కట్టడి చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.
ఓపెనర్ మిథాలీ రాజ్(62) హాఫ్ సెంచరీ సాధించగా,మందనా(21), వేదా కృష్ణమూర్తి(21)లు ఫర్వాలేదనిపించారు. అనంతరం 122 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన లంక మహిళలు పోరాడకుండానే చేతులెత్తేశారు. దిలానీ మండోదర(20), ప్రశాదనీ వీరక్కోడి(14)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా క్రీడాకారిణులంతా సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో లంకకు ఘోర ఓటమి తప్పలేదు. భారత మహిళల్లలో ఏక్తా బిస్త్,ప్రీతి బోస్లు చెరో మూడు వికెట్లతో లంకను కట్టడి చేయగా,జులాన్ గోస్వామి,అనుజా పటేల్, పూనమ్ యాదవ్ లకు తలో వికెట్ దక్కింది.
ఈ తాజా మ్యాచ్లో విజయంతో భారత్ వరుసగా నాల్గో గెలుపును సొంతం చేసుకుంది. అంతకుముందు బంగ్లాదేశ్, థాయ్ లాండ్, పాకిస్తాన్లపై భారత్ వరుసగా విజయాల్ని సాధించిన సంగతి తెలిసిందే.