
‘ఇద్దరు’ ఫామ్‌లోకి వచ్చేదెప్పుడు?
వరుసగా విఫలమవుతున్న కోహ్లి, రైనా
భారత్‌ను దెబ్బతీస్తున్న ఆటతీరు
బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ఓటమి... ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో టి20 సిరీస్ గల్లంతు... ఈ వరుస పరాజయాలతో అందరి దృష్టి భారత కెప్టెన్ ధోనిపైనే నిలిచింది. అతని స్థానాన్ని ప్రశ్నించడంపైనే ఆసక్తి చూపిన విమర్శకులు మరోవైపు వైఫల్యం గురించి ఆలోచించే ప్రయత్నం చేయలేదు. కొందరు ఉద్దేశపూర్వకంగా దానిని పట్టించుకోకపోయినా... భావి కెప్టెన్ అంటూ మోసిన విరాట్ కోహ్లి ఇప్పుడు బ్యాటింగ్‌లోనే తడబడుతున్నాడు.
వన్డేల్లో ఫినిషింగ్ అంటే ధోనికి సరిజోడు సురేశ్ రైనా. చివరి ఓవర్లలో ధనాధన్ బ్యాటింగ్‌తో మ్యాచ్ దిశ మార్చడంలో అతనికి అతనే సాటి. గత కొన్నేళ్లలో జట్టు భారీ స్కోరు సాధించినా... భారీ లక్ష్యాలను ఛేదించినా వాటిలో రైనా కీలక పాత్ర పోషించాడు. కానీ అతను ఇప్పుడు ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్నాడు. ఈ ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్ వరుసగా విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపిస్తోంది.
దక్షిణాఫ్రికాతో తొలి టి20 మ్యాచ్‌లో రోహిత్‌కు అండగా నిలుస్తూ 43 పరుగులు చేసిన కోహ్లి ఆ తర్వాతి మూడు ఇన్నింగ్స్‌లలో చేసిన స్కోర్లు వరుసగా 1, 11, 12. జట్టు నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ ఆటతీరు ఇలా ఉంటే అది కచ్చితంగా ఫలితంపై పడుతుంది. క్రీజ్‌లో నిలదొక్కుకొని ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన ఆటగాడు తేలిపోవడంతో తర్వాతి లైనప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇక రైనా టి20లు, వన్డేల్లో వరుసగా 14, 22, 3, 0 పరుగులు చేశాడు. దశాబ్దానికిపైగా జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న బ్యాట్స్‌మెన్ నుంచి ఇలాంటి స్కోర్లు రావడం జట్టును ఆందోళనపరిచే అంశం.
ఆత్మవిశ్వాసం లోపించిందా: ‘భాయ్... నువ్వైతే ఫామ్‌లోకి వచ్చేశావ్. మరి నేనేం చేయాలి’... తన బ్యాటింగ్ గురించి ధోనికి కోహ్లి ప్రశ్న ఇది. దానికి సమాధానమిస్తూ మహి... ‘చాలా సింపుల్. నీ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు. కెప్టెన్సీపై కాదు’ సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ జోక్‌లో వ్యంగ్యమే కాదు. వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే భారత టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాక ఆ ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లి... వన్డేల్లో మాత్రం తేలిపోయాడు. కెప్టెన్‌గా ఆరు టెస్టుల్లో కోహ్లి 63.2 సగటుతో 696 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. అదే ధోని నాయకత్వంలో వన్డేల్లో బరిలోకి దిగిన 17 మ్యాచ్‌లలో కేవలం 28.64 సగటుతో 401 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై శతకం బాదిన తర్వాత వరుసగా 12 ఇన్నింగ్స్‌లో కోహ్లి కనీసం అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇన్ని మ్యాచ్‌ల్లో వరుసగా విఫలం కావడం అతని కెరీర్‌లో ఎప్పుడూ లేదు. ఆశ్చర్యం అనిపించినా 2010 నుంచి 2014 వరకు ఐదేళ్ల పాటు వన్డేల్లో భారత టాప్ స్కోరర్‌గా ఉన్న విరాట్ ఈ ఏడాది టాప్-5లో కూడా లేడు. అతను పరుగులు చేయకపోవడం కంటే క్రీజ్‌లో అసౌకర్యంగా కనిపించడం కొత్తగా అనిపిస్తోంది.
తొలి వన్డేలో షార్ట్ ఫైన్‌లెగ్‌లో సునాయాస క్యాచ్ ఇచ్చాడు. రెండో వన్డేలోనైతే అతని రనౌట్ ఆత్మహత్యా సదృశ్యం. స్ట్రైకింగ్ ఎండ్ నుంచి ఫీల్డర్‌ను స్పష్టంగా చూస్తూ రహానే కంటే మంచి ‘వ్యూ’లో ఉండి, అతను వద్దంటున్నా పరుగు కోసం దూసుకురావడం అర్థం లేనిది. కోహ్లి రెండు వన్డేల్లోనూ ఒక్క బౌండరీ కూడా కొట్టలేక పోయాడంటే అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో అర్థమవుతోంది! తనకిష్టమైన మూడో స్థానం నుంచి మార్చారనే అసంతృప్తి ఉందని వినిపిస్తున్నా... ఎక్కడైనా ఆడగల సామర్థ్యం ఉన్న అతనిలాంటి స్టార్ ప్లేయర్‌కు అది పెద్ద సమస్య కాదు.
జోరు తగ్గిపోయింది: సురేశ్ రైనా పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరంగా ఉంది. క్రీజ్‌లోకి వచ్చీ రాగానే దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయే రైనా కూడా షాట్లు ఆడేందుకు కిందా మీదా పడిపోతున్నాడు. టెస్టుల్లో ఎలాగూ లేని రైనా తన బ్రాండ్ టి20, వన్డేల్లో కూడా ప్రభావం చూపలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో పేలవంగా అవుటైన అతను... రెండో వన్డేలోనైతే లెగ్‌సైడ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. షార్ట్ పిచ్ బంతి ఆడలేని బలహీనత వల్ల వైడ్ కావాల్సిన బాల్‌కు కూడా వెనుదిరగడం అతనికే చెల్లింది! దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు రైనా నెదర్లాండ్స్ వెళ్లి మరీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత సొంతగడ్డపై ప్రాక్టీస్ కోసం ద్రవిడ్‌కు చెప్పి బంగ్లాదేశ్‌తో జరిగిన ఇండియా ‘ఎ’ సిరీస్‌లో ఆడాడు. అక్కడ తొలి రెండు వన్డేల్లో విఫలమైనా, చివరి మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో సన్నాహకాలు బాగున్నట్లే అనిపించింది. అయితే అసలు మ్యాచ్‌లలో ఫలితం దక్కలేదు. జట్టు కోసం లోయర్ ఆర్డర్‌లో ఆడేందుకు సిద్ధమైన ఏకైక ఆటగాడు అంటూ కెప్టెన్ ధోని ప్రశంసలైతే దక్కాయి కానీ ఆరో స్థానంలో ఆడటం జట్టుకు ఉపయోగపడలేదు. తన కెరీర్‌లో ఎక్కువ భాగం మంచి ప్రదర్శన కనబర్చిన ఐదో స్థానం వేర్వేరు కారణాలతో ఇప్పుడు ధోని తీసుకున్నాడు. నిజానికి ఇండోర్ మ్యాచ్‌లో అతనికి 23వ ఓవర్లోనే బ్యాటింగ్ అవకాశం వచ్చింది. గతంలో ఎక్కువ సార్లు 35-40 ఓవర్ల మధ్యలో వచ్చిన రైనాకు ఇది మంచి అవకాశం. కానీ ఇక్కడా అతను తడబడ్డాడు. మొత్తం జట్టు వైఫల్యంగా చూస్తుండటంతో రైనా సమస్యను ఎవరూ పెద్దగా గుర్తించలేదు. తనదైన శైలిలో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడకపోతే ఇక విమర్శల గన్ అతని వైపు కూడా తిరుగుతుంది.
దూకుడుకిదే సమయం: మరో ఆటగాడు శిఖర్ ధావన్ కూడా అంతంత మాత్రంగానే ఆడుతున్నాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌లలో అతను 3, 11, 23, 23 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్‌గా రోహిత్‌తో పోటీ పడి అతను పరుగులు సాధించాల్సి ఉంది. ఇండోర్‌లాంటి అదృష్టం మళ్లీ మళ్లీ కలిసొస్తుందని గ్యారంటీ లేదు కాబట్టి ప్రధాన బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఇలాగే కొనసాగితే వన్డే సిరీస్ కూడా సఫారీలపాలు అయ్యే ప్రమాదం ఉంది. -సాక్షి క్రీడా విభాగం