ముంబై : సిక్సర్లతో విరుచుకుపడుతూ.. డబుల్ సెంచరీలతో ప్రపంచ రికార్డులు నమోదు చేస్తున్న టీమిండియా తాత్కలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఒకప్పుడు పోలీసుల బెదిరింపులు ఎదుర్కొన్నాడట. టీవీ వ్యాఖ్యాత గౌరవ్‌కపూర్ ‘చాంపియన్స్ విత్ బ్రేక్‌ఫాస్ట్ షో’లో తన జీవితంలోని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ షో సరిగ్గా ఇండోర్ మ్యాచ్‌కు ముందు ప్రసారం అయింది. ఈ చిట్‌చాట్‌లో స్కూల్‌డేస్‌లో తనని పోలీసులు అరెస్ట్ చేస్తామని బెదిరించిన ఘటనను రోహిత్ గుర్తుచేసుకున్నాడు.
‘మా కుటుంబం ఎప్పూడు క్రికెట్‌ను ఇష్టపడేది. రోజుకు 16 గంటలు క్రికెట్ మ్యాచ్‌లను చూసేవాళ్లం. మా బాబాయ్‌లు, పిన్నిలందరం కలిసి మా వీధిలో క్రికెట్ ఆడే వాళ్లం. ఓ ముగ్గురు.. నలుగురు.. స్నేహితులమైతే వీధిలో ఎప్పుడూ క్రికెట్ ఆడేవాళ్లం. మా బాబాయ్‌లు బిల్డింగ్ పై నుంచి చూస్తూ.. నా బ్యాటింగ్‌ను పరీక్షించేవారు. ఇలా ఆడుతూ భారీ షాట్లతో మా వీధిలో చాలా కిటికీ అద్దాలు పగలగొట్టాను. వారంతా నాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు నా దగ్గరకు వచ్చి ఇంకోసారి కిటికీ అద్దాలు పగలగొడితే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. నావల్ల మా చుట్టుపక్కల వాళ్లు చాలా ఇబ్బంది పడేవారు. తరువాత మా క్రికెట్‌ని మైదానాల్లోకి మార్చడంతో ఇలాంటి ఫిర్యాదులు రాలేదని’ రోహిత్ తన చిన్ననాటి సంఘటనని గుర్తుచేసుకున్నాడు.
అంతేకాకుండా తన సతీమణి రితికాను తొలి సారి కలుసుకున్న సందర్భం, ఎంగేజ్‌మెంట్ రోజు హోటల్లో రింగ్ మర్చిపోవడం, తన అభిమాని క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ల గురించి మరిన్ని విశేషాలు రోహిత్ ఈ షోలో చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment