సచిన్ టెండూల్కర్ (ఫైల్ ఫొటో)
హైదరాబాద్ : ఫకార్ జమాన్.. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల నోట మారు మోగుతున్న పేరు. జింబాబ్వేతో జరిగిన నాలుగోవన్డేలో ఈ పాకిస్తాన్ ఓపెనర్ 156 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్లతో డబుల్ సెంచరీ(210 నాటౌట్) సాధించాడు. దీంతో పాక్ తరుపున తొలి ద్విశతకం సాధించి తొలి ఆటగాడిగా ఫకార్ గుర్తింపు పొందాడు. అయితే ఫకార్ డబుల్‌తో మరోసారి డబుల్ సెంచరీ రికార్డులు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే భారత్ నుంచి ఓపెనర్ రోహిత్ శర్మ (209, 264, 208) మూడు డబుల్ సెంచరీలు సాధించగా.. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(219), మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (200)లు సైతం డబుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.
అయితే వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ చేసిందీ ఎవరు? అని అడిగితే వెంటనే అందరి నోట వచ్చే మాట.. సచిన్ టెండూల్కర్. కానీ వన్డే క్రికెట్‌లో సచిన్ కన్నా ముందే ఒకరు డబుల్ సెంచరీ నమోదు చేశారు. క్రికెట్‌లో ప్రతీ రికార్డును సచినే పరిచయం చేశాడు.. కానీ డబుల్ సెంచరీని మాత్రం ఓ మహిళా క్రికెటర్ సాధించింది. ఆమె.. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ బెలిండా క్లార్క్. ఓవరాల్ అంతర్జాతీయ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించారు. 1997 మహిళా ప్రపంచకప్ గేమ్ టోర్నీలో ఆమె డెన్మార్క్‌పై 229 పరుగులు చేశారు. 155 బంతులు ఆడిన బెలిండా 22 ఫోర్లతో 229 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక పురుషుల వన్డేల్లో తొలి డబుల్ సాధించింది మాత్రం సచిన్ టెండూల్కరే.
వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్స్
- బెలిండా డెన్మార్క్ 229 నాటౌట్ (డెనార్మ్‌పై, 1997)
- సచిన్ టెండూల్కర్ 200 నాటౌట్ ( 2010లో దక్షిణాఫ్రికాపై)
- వీరేంద్ర సెహ్వాగ్ 219 (2011లో వెస్టిండీస్)
- రోహిత్ శర్మ 209 (2013లో ఆస్ట్రేలియా)
- రోహిత్ శర్మ264 (2014లో శ్రీలంకపై)
- క్రిస్ గేల్ 215(2015 వరల్డ్‌కప్, జింబాబ్వేపై)
- మార్టిన్ గప్టిల్ 237 నాటౌట్ (2015, వెస్టిండీస్)
- రోహిత్ శర్మ 208( 2017, శ్రీలంక)
- ఫకార్ జమాన్ 210 నాటౌట్ ( 2018, జింబాబ్వే)
Comments
Please login to add a commentAdd a comment