ఒకప్పుడు డబుల్ సెంచరీలు కొట్టాలంటే అది టెస్టుల్లో మాత్రమే సాధ్యమయ్యేది. ఐదు రోజుల పాటు జరిగే మ్యాచ్‌లు కాబట్టి బ్యాటింగ్‌కు ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి బ్యాటర్లు డబుల్ సెంచరీలతో చెలరేగడం సహజం. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అది సాధ్యం కాకపోయేది. ఒక్కరోజులో ముగిసిపోయే వన్డే మ్యాచ్‌లో సెంచరీలను చాలా గొప్పగా చూసేవారు. అయితే సనత్ జయసూర్య, షాహిద్ అఫ్రిది, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి హిట్టర్లు వచ్చాకా వన్డే ఆటతీరు పూర్తిగా మారిపోయింది. వన్డే క్రికెట్‌లో దూకుడు అనే పదానికి నిర్వచనం చెప్పారు ఈ క్రికెటర్లు
-సాక్షి, వెబ్‌డెస్క్
గొప్ప కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ధోని.. 2004లో శ్రీలంకపై ఆడిన 183 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ కావొచ్చు.. 2000లో న్యూజిలాండ్‌పై భాగ్యనగరంలో(హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో) సచిన్ ఆడిన 186 పరుగుల ఇన్నింగ్స్ కావొచ్చు.. గంగూలీ 183 పరుగులు కావొచ్చు.. ఇలా అప్పట్లో 180, 190 పరుగుల ఇన్నింగ్స్‌ను గొప్పగా భావించేవారు. డబుల్ సెంచరీలు చేయనప్పటికి వాటికి సమాన ప్రాధాన్యత దక్కింది.
అయితే 13 ఏళ్ల క్రితం(2009లో సౌతాఫ్రికాపై వన్డే మ్యాచ్‌లో) క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. అప్పటికే లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్న మాస్టర్ ఈ ఫీట్ అందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పేరు మార్మోగిపోయింది. అలా వన్డేల్లో డబుల్ సెంచరీ అనే పదానికి సచిన్ పురుడు పోస్తే.. ఆ తర్వాత టీమిండియా మాజీ విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తానేం తక్కువ తిన్నానా అన్నట్లు 2011లో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు చెలరేగిన సెహ్వాగ్ 41 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 219 పరుగులు సాధించాడు. వన్డే క్రికెట్‌లో ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం.
ఈ లెక్కన చూసుకుంటే వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీలకు పునాది వేసింది టీమిండియా ఓపెనర్లే అని చెప్పొచ్చు. ఆ తర్వాత టి20 క్రికెట్, ఐపీఎల్ లాంటి లీగ్ క్రికెట్‌లు ఎక్కువ కావడంతో ఆటగాళ్ల బ్యాటింగ్‌లో వేగం పెరిగింది. అలా వన్డేల్లోనూ బ్యాటర్లు టి20 తరహా స్టైల్లో బ్యాటింగ్ చేయడంతో ఆ తర్వాత చాలా డబుల్ సెంచరీలు వచ్చాయి. అందులో ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలతో ఎవరికి సాధ్యం కాని రికార్డు అందుకున్నాడు.
అటుపై గేల్, మార్టిన్ గప్టిల్, ఫఖర్ జమాన్‌లు ఉన్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు 10 డబుల్ సెంచరీలు నమోదైతే అందులో టీమిండియా నుంచే ఏడు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. ఇందులో రోహిత్ శర్మవి మూడు కాగా.. సచిన్,సెహ్వాగ్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు ఒక్కో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. పైన చెప్పుకున్న ఏడుగురు ఆటగాళ్లు అందరూ ఓపెనర్లుగా వచ్చి డబుల్ సెంచరీలు బాదారు. అయితే మిడిలార్డర్‌లో వచ్చి డబుల్ సెంచరీ కొట్టడం అసాధ్యమైనప్పటికి మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్య లాంటి ఆటగాళ్లకు ఈ డబుల్ ఫీట్ చేసే చాన్స్ ఉంది. ఇది జరిగితే మాత్రం విశేషమే అని చెప్పుకోవచ్చు.
ఏది ఏమైనా మారుతున్న కాలంలో ఆటకు వేగం తోడయ్యింది. టి20లకు బాగా అలవాటు పడి వన్డే క్రికెట్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌లతో బ్యాటర్లు అలరించడం మొదలెట్టారు. ఇప్పటికైతే వన్డేల్లో డబుల్ సెంచరీలు కొట్టడం గ్రేట్‌గా పరిగణిస్తున్నారు. ఆధునిక క్రికెట్‌లో టి20 క్రికెట్ ఎక్కువగా ఆడుతున్న ఈతరం క్రికెటర్లు దూకుడైన ఆటతీరు కనబరుస్తున్నారు. కొన్నిసార్లు ఇది చేటు చేసినా మంచి పరిణామమే. మరి రాబోయే కాలంలో డబుల్ సెంచరీలను మించి త్రిబుల్ సెంచరీలు కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.
చదవండి: డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్
హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన గిల్.. టీమిండియా భారీ స్కోర్
Comments
Please login to add a commentAdd a comment