
మహ్మద్ షమీ(ఫైల్‌ఫొటో)
న్యూఢిల్లీ: పలువురి యువతులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా తనపై గృహహింసకు పాల్పడినట్లు భార్య హాసిన్ జహాన్ చేసిన ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న టీమిండియా పేసర్ షమీ.. ఇటీవల బీసీసీఐ ప్రకటించిన వార్షిక వేతనాల కాంట్రాక్ట్ జాబితాలో కూడా చోటు కోల్పోయాడు. మరొకవైపు అతను ఐపీఎల్‌లో ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. షమీపై ఐదు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో అతని క్రీడా జీవితం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలోనే వచ్చే నెలలో ఆరంభయ్యే ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున షమీ ఆడటం కష్టమనే చెప్పాలి.
వివాదంలో చిక్కుకున్న షమీని ఐపీఎల్ క్యాంప్‌లకు అనుమతించాలా? వద్దా అనే సందిగ్ధంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం ఉంది. ఈ విషయంలో బీసీసీఐ న్యాయసలహా తీసుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. సున్నితమైన అంశం కాబట్టి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం సిద్ధంగా లేదు. ఒకవేళ ఐపీఎల్‌కు షమీ దూరమైతే అతని స్థానంలో ఎవరు అనేది చర‍్చనీయాంశమైంది. దీనిలో భాగంగా నలుగురి బౌలర్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విదర్భ పేసర్ రజ్నీస్ గుర్బానీతో పాటు ఇషాంత్ శర్మ, శ్రీనాథ్ అరవింద్, అశోక్ దిండాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకసారి వీరి గురించి పరిశీలిద్దాం.
రజ్నీస్ గుర్బానీ..
2017-18 సీజన్‌లో విదర్భ జట్టు రంజీ ట్రోఫీ గెలవడంలో గుర్బానీది ప్రధాన పాత్ర. ఆ సీజన్‌లో 39 వికెట్లు సాధించి అత్యధిక వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఢిల్లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హ్యాట‍్రిక్ వికెట్లను సాధించడంతో పాటు మొత్తంగా ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకుని విదర్భ తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇక హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లు, కేరళతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 5 వికెట్లను, కర్ణాటకతో జరిగిన సెమీ ఫైనల్లో 7 వికెట్లను గుర్బానీ సాధించాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐపీఎల్ వేలంలో గుర్బానీని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్ వేలంలో గుర్బానీ కనీస ధర రూ. 20 లక్షలుండగా అతన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. మరి ఇప్పుడు షమీకి ప్రత్యామ్నాయంగా గుర్బానీ తొలి స్థానంలో ఉన్నాడు.
ఇషాంత్ శర్మ..
గత కొంతకాలంగా వికెట్లు సాధించడంలో విఫలమవుతున్న ఇషాంత్ శర్మను ఐపీఎల్-11సీజన్‌లో కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. అతని కనీస ధర రూ. 75 లక్షలుండగా ఫ్రాంచైజీల నమ్మకాన్ని మాత‍్రం గెలవలేకపోయాడు. గతేడాది కూడా ఇషాంత్‌ను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే చివరి నిమిషంలో మురళీ విజయ్ గాయపడటంతో అతని స్థానంలో ఇషాంత్‌ను కింగ్స్ పంజాబ్ తీసుకుంది. కింగ్స్ పంజాబ్ మెంటార్ సెహ్వాగ్ సలహా మేరకు ఇషాంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఆ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ శర్మ ఒక వికెట్‌ను కూడా తీయలేకపోయాడు. అయితే ఇషాంత్‌కు ఐదు వేర్వేరు ఐపీఎల్ జట్లకు ఆడిన అనుభవం ఉంది. దాంతో పాటు ఢిల్లీ లోకల్ బాయ్ కావడం అతనికి కలిసొచ్చే అంశం.
శ్రీనాథ్ అరవింద్..
కర్ణాటకకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్.. 2011 ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ తరపున విశేషంగా రాణించాడు. ఆ సీజన్‌లో 21వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఆపై 2016-17 సీజన్‌లో మరొకసారి మెరిసినప్పటికీ, ఈ సీజన్‌లో మాత‍్రం అతన్ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఇటీవల దేశవాళీ క్రికెట్‌కు 33 ఏళ్ల అరవింద్ గుడ్ బై చెప్పాడు. ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో అతని కనీస ధర రూ. 50 లక్షలు కాగా, అతను అమ్ముడుపోలేదు. పవర్ ప్లేలో కుదురుగా బౌలింగ్ వేసే అరవింద్ పేరు ఢిల్లీ డేర్ డెవిల్స్ పరిశీలనలో ఉంది.
అశోక్ దిండా..
2016 ఐపీఎల్ సీజన్ వేలంలో చివరి నిమిషంలో పుణె జట్టు అశోక్ దిండాని కొనుగోలు చేసింది. ఫైనల్ రౌండ్‌లో దిండా పుణె జట్టులోకి వచ్చాడు.ఆ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు సాధించి పుణె గెలుపులో దిండా కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో మొత్తం 9 గేమ్‌లు ఆడిన దిండా.. 11 వికెట్లను మాత్రమే సాధించాడు. ఆ తర్వాత 2017 సీజన్‌లో మూడు గేమ్‌లు మాత్రమే ఆడిన ఈ బెంగాల్ పేసర్ దాదాపు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐపీఎల్లో 10 ఏళ్ల అనుభవం ఉన్నప‍్పటికీ దిండాను నిలకడలేమి బాధిస్తోంది. దాంతో ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా దిండాను కొనుగోలు చేసేందుకు అస‍్సలు ఆసక్తికనబరచలేదు. అతని కనీస ధర రూ. 50 లక్షలు కాగా, దిండాకు నిరాశే ఎదురైంది.
Comments
Please login to add a commentAdd a comment