
మహ్మద్ షమీ
సాక్షి, స్పోర్ట్స్ : ‘మూలిగే నక్కమీద తాటి పండొచ్చి పడ్డట్లుంది’ టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వ్యవహారం. ఇప్పటికే పలువురి యువతులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని భార్య హాసిన్ జహాన్ చేసిన ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న షమీ.. ఐపీఎల్‌లో ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఆరోపణలతో వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో బీసీసీఐ షమీకి చోటు కల్పించని విషయం తెలిసిందే.
అయితే తాజాగా వివాదంలో చిక్కుకున్న షమీని ఐపీఎల్ క్యాంప్‌లకు అనుమతించాలా? వద్దా అనే సందిగ్ధంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం ఉంది. ఈ విషయంలో బీసీసీఐ న్యాయసలహా తీసుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. ‘ సున్నితమైన ఈ అంశంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తొందరపాటు నిర్ణయం తీసుకోదు. ఇప్పటికే ఈ విషయంలో బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని’ ఓ సీనియర్ ఫ్రాంచైజీ అధికారి మీడియాకు తెలిపారు. మహ్మద్ షమీని వేలంలో ఢిల్లీ రూ. 3 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.
షమీ అనేక మంది యువతులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని అతని భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కోల్‌కతా పోలీసులు షమీపై గృహ హింసా చట్టం, భార్య జహాన్‌ను వేధించటం.. రేప్ అటెంప్ట్.. హత్యాయత్నం, వివాహేతర సంబంధాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వివాదంతో షమీ ఐపీఎల్‌కు దూరమైతే షమీ కెరీర్ ప్రశ్నార్ధకంగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment