జడేజా, విహారి
ఓపెనింగ్ శుభారంభం ఇవ్వలేదు. టాపార్డర్ సంయమనంతో ఆడలేదు. ఇక భారత మిడిలార్డర్ ఏం చేస్తుంది? టెయిలెండర్ల ఆట ఎంతసేపు... అని తేలిగ్గా నిట్టూర్చిన క్రికెట్ అభిమానులకు తెలుగు తేజం విహారి, జడేజా షాక్ ఇచ్చే ప్రదర్శన ఇచ్చారు. మొదట కుదురుగా ఆడుకున్నారు. తర్వాత ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతుండటంతో ఈ టెస్టు రసకందాయంగా మారింది. ఎటువైపు మొగ్గేది నేటి ఆటతో తేలుతుంది.
లండన్: ఇక ఆఖరి టెస్టు ఫలితం ఏకపక్షం కాబోదు. ఆతిథ్య జట్టే గెలుస్తుందన్న అంచనాలు నిలబడవు. గెలిచే బరిలో భారత్ కూడా ఉండే అవకాశముంది. ఇదంతా ఇద్దరి ఆటతీరుతో మారిపోయింది. ఆరు వికెట్లు పారేసుకున్న భారత బ్యాటింగ్‌కు తొలి టెస్టు ఆడుతోన్న తెలుగు తేజం గాదె హనుమ విహారి (124 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్) ఊతమిస్తే... లోయర్ మిడిలార్డర్‌లో రవీంద్ర జడేజా (156 బంతుల్లో 86; 11 ఫోర్లు, 1 సిక్స్) సత్తా చాటాడు. దీంతో ఇంగ్లండ్ ఆధిపత్యానికి గండిపడింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 95 ఓవర్లలో 292 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఆతిథ్య జట్టుకు కేవలం 40 పరుగుల ఆధిక్యమే లభించింది. అండర్సన్, స్టోక్స్, మొయిన్ అలీ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కెరీర్‌లో చివరి టెస్టు ఇన్నింగ్స్ ఆడుతోన్న కుక్ (125 బంతుల్లో 46 బ్యాటింగ్; 3 ఫోర్లు)తోపాటు కలిసి కెప్టెన్ రూట్ (43 బంతుల్లో 29 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. షమీ, జడేజా ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం 40 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అర్ధ శతకాలతో...
ఓవర్‌నైట్ స్కోరు 174/6తో ఆదివారం ఆట ప్రారంభించిన భారత్‌ను విహారి, జడేజాలిద్దరూ ఆదుకున్నారు. తొలి సెషన్‌లో వీరిద్దరు నెలకొల్పిన కీలక భాగస్వామ్యం ఇంగ్లండ్ ఆధిక్యాన్ని బాగా తగ్గించింది. ముందుగా క్రీజులో పాతుకునేందుకు ప్రాధాన్యమిచ్చిన వీరిద్దరు ఆ తర్వాత పరుగులు జోడించడంపై దృష్టి పెట్టారు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ఎంత కవ్వించినా షాట్ల జోలికి వెళ్లకుండా నింపాదిగా ఆడారు. తొలి గంటలో 33 పరుగులు వచ్చాయి. అలా 63వ ఓవర్లో జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది.
అడపాదడపా జడేజా బ్యాట్‌కు పనిచెప్పినా... విహారి మాత్రం కుదురుగా ఆడాడు. ఈ క్రమంలోనే తెలుగు కుర్రాడు తన తొలి టెస్టులోనే 104 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. తద్వారా కరుణ్ నాయర్‌ను కాదని కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకానికి న్యాయం చేశాడు. ఈ సెషన్ సాగుతున్న కొద్దీ ఇంగ్లండ్ శిబిరంలో కలవరం మొదలైంది. అయితే లంచ్ విరామానికి ముందు ఎట్టకేలకు మొయిన్ అలీ ఈ జోడీని విడగొట్టాడు.
జట్టు స్కోరు 237 పరుగుల వద్ద విహారి కీపర్ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఏడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో ఇషాంత్ క్రీజ్‌లోకి రాగా లంచ్ తర్వాత పరుగుల బాధ్యతను పూర్తిగా జడేజా తీసుకున్నాడు. అవతలి బ్యాట్స్‌మెన్‌కు అవకాశమివ్వకుండా డబుల్స్, బౌండరీలు బాదేందుకు ఉత్సాహం చూపాడు. 113 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జడేజా... ఇషాంత్ (4), షమీ (1), బుమ్రా (0) సాయంతో 55 పరుగులు జోడించడం విశేషం.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 332;
భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) కరన్ 37; ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) బ్రాడ్ 3; పుజారా (సి) బెయిర్ స్టో (బి) అండర్సన్ 37; కోహ్లి (సి) రూట్ (బి) స్టోక్స్ 49; రహానే (సి) కుక్ (బి) అండర్సన్ 0; విహారి (సి) బెయిర్‌స్టో (బి) మొయిన్ అలీ 56; రిషభ్ పంత్ (సి) కుక్ (బి) స్టోక్స్ 5; జడేజా (నాటౌట్) 86; ఇషాంత్ శర్మ (సి) బెయిర్‌స్టో (బి) మొయిన్ అలీ 4; షమీ (సి) బ్రాడ్ (బి) రషీద్ 1; బుమ్రా (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (95 ఓవర్లలో ఆలౌట్) 292.
వికెట్ల పతనం: 1–6, 2–70, 3–101, 4–103, 5–154, 6–160, 7–237, 8–249, 9–260, 10–292.
బౌలింగ్: అండర్సన్ 21–7–54–2, బ్రాడ్ 20–6–50–1, స్టోక్స్ 16–2–56–2, కరన్ 11–1–49–1, మొయిన్ అలీ 17–3–50–2, రషీద్ 10–2–19–1.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: అలిస్టర్ కుక్ (బ్యాటింగ్) 46; జెన్నింగ్స్ (బి) షమీ 10; మొయిన్ అలీ (బి) జడేజా 20; రూట్ (బ్యాటింగ్) 29, ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (43 ఓవర్లలో 2 వికెట్లకు) 114.
వికెట్ల పతనం: 1–27, 2–62.
బౌలింగ్: బుమ్రా 12–4–26–0, ఇషాంత్ శర్మ 7–3–11–0, షమీ 10–3–32–1, జడేజా 14–2–36–1.
శభాష్... విహారి
దేశవాళీ మ్యాచ్‌ల్లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకునే హనుమ విహారి అరంగేట్రం చేసిన అంతర్జాతీయ మ్యాచ్‌లో జట్టును ఆదుకున్నాడు. సరిగ్గా టెస్టులకు సరిపోయే ఇన్నింగ్స్‌ను తన మొదటి టెస్టులోనే పరిచయం చేశాడు. ఆరో నంబర్‌లో సరిగ్గా నప్పే బ్యాట్స్‌మన్‌గా టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఆశలు పెంచాడు. జడేజాతో కలిసి తొలి సెషన్‌లో విహారి చేసిన అర్ధశతక పోరాటం ఏ మాత్రం తీసిపోనిది. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను బాధ్యతాయుత బ్యాటింగ్‌తో గాడిన పెట్టాడు.
వికెట్‌ను కాపాడుకుంటూ... ఒక్కో పరుగును జత చేస్తూ... పరుగుల పయనాన్ని అర్ధసెంచరీ దాకా సాగించాడు. జడేజా కూడా విహారికి అండగా నిలువడంతో ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఈ జోడీని తొందరగా విడగొట్టేందుకు కెప్టెన్ రూట్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా విహారి ఏకాగ్రతను కోల్పోలేదు. ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్రం టెస్టులోనే అర్ధసెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా విహారి నిలిచాడు. ఇంతకుముందు గంగూలీ, ద్రవిడ్‌లు ఒకే టెస్టులో ఈ ఘనత సాధించారు. ఈ దిగ్గజాల సరసన విహారి నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment