సరైన సమయంలో సరైన నిర్ణయం
♦ రిటైర్మెంట్‌పై ధోని
♦ ఆస్ట్రేలియాకు పయనమైన భారత జట్టు
ముంబై: కెరీర్‌కు గుడ్‌బై చెప్పే విషయంలో తాను సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటానని భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆసీస్ పర్యటనే తనకు ప్రధానమని అతను చెప్పాడు. వరల్డ్ కప్ తర్వాత భారత్ రెండు వన్డే సిరీస్‌లు ఓడిపోవడం, ధోని ఫామ్ కూడా గొప్పగా లేకపోవడంతో పాటు కోహ్లిని అన్ని ఫార్మాట్‌లలో కెప్టెన్‌ను చేయాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ధోని ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘నేను వర్తమానంలో మాత్రమే బ్రతికే మనిషిని. ప్రస్తుతం నేను ఆస్ట్రేలియా సిరీస్ గురించి, ఆ తర్వాత జరిగే టి20 ప్రపంచ కప్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. రిటైర్మెంట్ గురించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా’ అని ధోని పేర్కొన్నాడు. ఐదు వన్డేలు, మూడు టి20ల సిరీస్‌ల కోసం భారత జట్టు ఆస్ట్రేలియా బయల్దేరుతున్న సందర్భంగా ధోని మంగళవారం మీడియాతో మాట్లాడాడు. అశ్విన్ ఫామ్‌లోకి రావడం తన పని సులువు చేస్తుందన్న ధోని, జడేజా పునరాగమనంపై కూడా సంతోషం వ్యక్తం చేశాడు. అయితే ఒకే స్పిన్నర్ కోసం స్థానం కోసం వీరితో పాటు అక్షర్ కూడా పోటీ పడుతున్నాడని గుర్తు చేశాడు.
ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాలో టి20 మ్యాచ్‌లు ఆడటం సరైన సన్నాహకమని ధోని చెప్పాడు. ‘ఆసీస్‌లాంటి జట్టుతో ఆడితే కచ్చితంగా మంచి అనుభవం వస్తుంది. ముఖ్యంగా కొత్త కుర్రాళ్లకు నేర్చుకునే అవకాశం లభిస్తుంది’ అని కెప్టెన్ అన్నాడు. వన్డేల్లో రైనా స్థానం కోల్పోయిన నేపథ్యంలో ఆరు లేదా ఏడు స్థానాల్లో గుర్ కీరత్ సింగ్, మనీశ్ పాండేలలో ఒకరికి అవకాశం దక్కవచ్చని ధోని సూత్రప్రాయంగా వెల్లడించాడు. మరో వైపు ఏడాది కాలంలో ఆటగాళ్లు మారినా... ఆస్ట్రేలియాతో తలపడటం ఎప్పుడైనా సవాల్‌లాంటిదేనని రహానే పేర్కొనగా, గాయంనుంచి కోలుకొని మళ్లీ భారత్‌కు ఆడబోతుండటం ఆనందంగా ఉందని పేసర్ షమీ అన్నాడు.