గెలిస్తే భారీ ప్రోత్సాహకాలు | Win huge incentives | Sakshi
Sakshi News home page

గెలిస్తే భారీ ప్రోత్సాహకాలు

Published Wed, Jan 28 2015 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

గెలిస్తే భారీ ప్రోత్సాహకాలు

గెలిస్తే భారీ ప్రోత్సాహకాలు

సాక్షి, హైదరాబాద్: జాతీయ క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగబోతున్న తెలంగాణ రాష్ట్ర జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే ఆటగాళ్లకు భారీ ప్రోత్సాహకాలు అందజేస్తామని క్రీడా శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ ప్రకటించారు. తొలిసారి తెలంగాణ జట్టు బరిలోకి దిగుతున్న ఈ క్రీడల కోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు. కేరళలో ఈ నెల 31నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులకు మంగళవారం కిట్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ క్రీడల్లో పాల్గొనే ఆటగాళ్ల కోసం మొదటి సారి ప్రత్యేకంగా వైద్యులతో పాటు సైకాలజిస్ట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడల తెలంగాణ కమిటీ చైర్మన్ జితేందర్ రెడ్డి, క్రీడా శాఖ కార్యదర్శి బీపీ ఆచార్య, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు, గగన్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.
 
14 క్రీడాంశాల్లో బరిలోకి
జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రంనుంచి మొత్తం 150 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. 19 మంది కోచ్‌లు, 17 మంది మేనేజర్లు కూడా ఈ బృందంలో ఉన్నారు. మొత్తం 14 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పోటీ పడనున్నారు. అక్వాటిక్స్, ఆర్చరీ, బీచ్ వాలీబాల్, షూటింగ్, రెజ్లింగ్, స్క్వాష్ రాకెట్స్, లాన్ టెన్నిస్, రోయింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, వుషు, ట్రయాథ్లాన్‌లలో జట్లు పాల్గొనడం అధికారికంగా ఖరారైంది.  కనోయింగ్ అండ్ కయాకింగ్, ఫెన్సింగ్‌లలో జట్టు పాల్గొనడంపై ఆయా సమాఖ్యలనుంచి లేఖ రావాల్సి ఉంది.
 
నేడు ఆంధ్రప్రదేశ్ కూడా...
మరో వైపు జాతీయ క్రీడల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్లకు సంబంధించి కిట్‌ల పంపిణీ కార్యక్రమం నేడు విజయవాడలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం 15 క్రీడాంశాల్లో బరిలోకి దిగుతోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, స్విమ్మింగ్, బీచ్ వాలీబాల్, ట్రయాథ్లాన్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, బాక్సింగ్‌లలో ఏపీ పోటీ పడుతోంది. రాష్ట్రం తరఫున మొత్తం 142 మంది ఆటగాళ్లు పోటీ పడనున్నారు. ఇందులో 67 మంది పురుషులు, 75 మంది మహిళలు ఉన్నారు. 23 మంది కోచ్‌లు, 16 మంది మేనేజర్లతో కలిపి మొత్తం 181 మంది సభ్యుల బృందం కేరళ వెళుతుంది.
 
పరస్పర రాజీ!
దాదాపు పక్షం రోజుల క్రితం వరకు కూడా జాతీయ క్రీడల్లో తెలంగాణ జట్టు పాల్గొనడం సందేహంగానే ఉంది. దాంతో సమైక్య ఆంధ్రప్రదేశ్‌గానే చాలా క్రీడాంశాల్లో  పాల్గొనేందుకు జట్లు సిద్ధమైపోయాయి. అయితే వారం క్రితం భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) రెండు వేర్వేరు జట్లను గుర్తిస్తూ జట్ల ఎంపిక కోసం అడ్‌హక్ కమిటీలు కూడా హడావిడిగా ఏర్పాటు చేయడంతో పరిస్థితి మారిపోయింది. క్వాలిఫై అయిన కొన్ని క్రీడాంశాల్లో ఒక రాష్ట్రం ఆటగాళ్లు ఎక్కువ మంది ఉంటే, మరో ఆటలో ఒక రాష్ట్రంనుంచి బలమైన క్రీడాకారులు ఉన్నారు.

దాంతో కొంత గందరగోళం, ఆ తర్వాత చర్చల అనంతరం ఇరు రాష్ట్రాల సంఘాల ప్రతినిధులు రాజీ మార్గానికి వచ్చారు. జాతీయ క్రీడలకు ఎనిమిది టీమ్ ఈవెంట్లలో సమైక్య ఆంధ్రప్రదేశ్ అర్హత సాధించింది. ఇప్పుడు మూడు క్రీడాంశాల్లో ఏపీ, ఐదు క్రీడాంశాల్లో తెలంగాణ జట్లు బరిలోకి దిగుతున్నాయి (వ్యక్తిగత అంశంలో ఈ సమస్య లేదు. ఆటగాడు ఏ రాష్ట్రం తరఫున అర్హత టోర్నీలు ఆడితే అతను అదే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తాడు). ఏపీలో పుట్టి, పెరిగినవారే తమ రాష్ట్రం తరఫున ఆడాలంటూ ఆ రాష్ట్రం గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తమ జట్టు బలహీనంగా మారినా తెలంగాణ ఆటగాళ్లను తీసుకునేందుకు వారు ఇష్ట పడలేదు.

దీనికి ఉదాహరణగా కబడ్డీ జట్టును చెప్పవచ్చు. అదే తరహాలో ఇటు తెలంగాణ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ ఏపీ గొడుగు కింద ఆడేందుకు ఇష్టపడటం లేదు. అందు కోసం అవసరమైతే కొన్ని అంశాలనుంచి తప్పుకునేందుకు కూడా సిద్ధమైంది. చివరకు బుధవారంనాటికి అన్నింటిపై స్పష్టత రావడంతో ఇరు రాష్ట్రాలు క్రీడల కోసం సిద్ధమయ్యాయి. అయితే బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్ అంశాలు మాత్రం దీనికి భిన్నం. ఈ రెండింటిలో ఆంధ్రప్రదేశ్ జట్టు మాత్రమే బరిలోకి దిగుతోంది. అయితే అందులో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులకు కూడా చోటు కల్పిస్తూ ఆయా జట్లను ఎంపిక చేయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement