కొలంబో : ఆధునిక టెక్నాలజీతో మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా మారుతున్నవేళ క్రికెట్ రంగంలో ఊహించని పిడుగు! ప్రత్యర్థిని ఓడించాలంటే సమర్థత, మెరుగైన ప్రాక్టీస్, నిలకడతనం కంటే మంత్రాలు, చేతబడులను నమ్ముకుంటున్నవైనం!! ఇటీవల పాకిస్తాన్‌పై శ్రీలంక టెస్టు సిరీస్ నెగ్గడానికి కారణం క్షుద్రపూజలేనని లంక కెప్టెన్ దినేశ్ చండీమల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి.
ఏమైంది? : శ్రీలంక- పాకిస్తాన్ జాతీయ జట్ల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వేదికగా(సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 29 వరకు) రెండు టెస్ట్‌లు, ఐదు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. టెస్ట్ సిరీస్‌ను లంక 2-0 తేడాతో కైవసం చేసుకుంది. పర్యటన ముగించుకుని లంక టీం మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ చండీమల్ విలేకరులతో మాట్లాడుతూ సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు.
మంత్రగత్తె ఆశీర్వాదంతో.. : ‘‘క్రికెట్‌లో ఆటగాడికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. కాస్త అదృష్టం కూడా కలిసిరావాలని నేను నమ్ముతాను. ఆ అదృష్టం మనకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా దొరుకుతుందో చెప్పలేం. అందుకే మతగురువులు, మంత్రగాళ్లు అనే తేడా లేకుండా అందరి దగ్గరా నేను ఆశీర్వాదాలు తీసుకుంటాను. పాకిస్తాన్‌తో సిరీస్ ఆడేందుకు వెళ్లేముందు ఓ మంత్రగత్తెను కలిశా. శ్రీలంక చేతిలో పాకిస్తాన్ ఓడిపోయేలా చేతబడి చేస్తానని ఆమె మాటిచ్చారు. ఆ తల్లి ఆశీర్వాదబలం, పూజల వల్లే మేం సిరీస్ గెలిచాం’’ అని లంక సారధి చండీమల్ చెప్పారు. రెండు మ్యాచ్‌ల్లోనూ అతను శతకం, అర్థశతకం సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మంత్రాలతో మ్యాచ్‌లు గెలవొచ్చా? : చండీమల్ వ్యాఖ్యలపై యావత్ క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. క్రికెట్‌లో క్షుద్రపూజలేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఒకవేళ మంత్రాలతో మ్యాచ్‌లు గెలవగలిగితే.. టెస్ట్ సిరీస్ నెగ్గిన శ్రీలంక జట్టు, ఆ తర్వాత జరిగిన వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో దారుణంగా ఎందుకు ఓడిపోయింది?’ అని ప్రశ్నిస్తున్నారు. పాక్‌తో టెస్ట్ సిరీస్ నెగ్గిన లంక.. 0-5తో వన్డే సిరీస్‌ను, 0-3 తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment