cricket series
-
దుబాయ్ ఇండోర్ క్రికెట్ సిరీస్‌కి వెళ్లనున్న ఆటగాళ్లు, వీరే!
2023 జనవరిలో జరిగిన సంక్రాంతి పండగ సందర్భంగా "శ్రీ సాంస్కృతిక కళాసారథి" ఏర్పాటు చేసిన 'మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్' (MFCL) టోర్నమెంట్ దాదాపు అందరికి గుర్తుండే ఉంటుంది. ఇందులో ఎన్నికైన ముగ్గురు ఉత్తమ తెలుగు కార్మిక సోదరులైన 'పినకాన తులసి రామ్, సీడి దిలీప్ వరప్రసాద్, అక్కరమని గణేష్ కుమార్' లను ఇండోర్ క్రికెట్ అసోసియేషన్ - సింగపూర్ (ICA) వారు ఏప్రిల్ 24, 25న జరగనున్న క్లబ్ వరల్డ్ సిరీస్, ఇండోర్ క్రికెట్ టోర్నమెంట్‌కు పంపుతున్నారని సమాచారం. ఈ టీమ్ కెప్టెన్‌గా రామ్ మడిపల్లి వ్యవహరించనున్నారని సింగపూర్ ఇండోర్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిథులు మురళీధరన్ గోవిందరాజన్, శంకర్ వీర తెలిపారు. "మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్" (MFCL) లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ముగ్గురు ఆటగాళ్ళు దుబాయ్ ఇండోర్ క్రికెట్ సిరీస్‌కి ఎంపిక అవ్వడం పట్ల పలువు టోర్నమెంట్ నిర్వాహుకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో గిరిధర్ సారాయి, నగేష్ టేకూరి, పోతగౌని నర్సింహా గౌడ్, అశోక్ ముండ్రు, కంకిపాటి శశిధర్ , సుదర్శన్ పూల, రాము చామిరాజు, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, సునీల్ రామినేని, కరుణాకర్ కంచేటి , మిట్టా ద్వారకానాథ్, తోట సహదేవుడు, ఎస్ కుమార్, లీల మోహన్, సురేంద్ర చేబ్రోలు మొదలైనవారు ఉన్నారు. -
సర్కారు వారి ఛానల్లో టీమిండియా మ్యాచ్‌లు
పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా వచ్చే నెలలో (జులై) వెస్టిండీస్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. విండీస్ పర్యటనలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లన్నీ సర్కారు వారి ఛానల్ అయిన డీడీ స్పోర్ట్స్‌లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారమవుతాయని భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. The TV broadcast of all cricket matches during India’s tour of West Indies in July 2022 will be available in India only on DD Sports, on all Cable & DTH platforms. @ddsportschannelhttps://t.co/b8MvynJu9g — Prasar Bharati प्रसार भारती (@prasarbharati) June 25, 2022 లైవ్ మ్యాచ్‌లతో పాటు నిపుణులు, సెలబ్రిటీలచే ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ విశ్లేషణలు కూడా అందిస్తామని ప్రసార భారతి పేర్కొంది. అన్ని కేబుల్, డీటీహెచ్ ప్లాట్‌ఫామ్‌లలో డీడీ స్పోర్ట్స్ ఛానల్ ప్రసారమవుతుందని తెలిపింది. కాగా, జులై 22 నుంచి ఆగస్ట్ 7 వరకు వెస్టిండీస్‌లో పర్యటించే టీమిండియా 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా జులై 17న పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగియగానే నేరుగా కరీబియన్ దీవులకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో టీమిండియా తొలుత మూడు వన్డేలు (జూలై 22, 24, 27), ఆతర్వాత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ (జులై 29, ఆగస్ట్ 1, 3, 6, 7) ఆడనుంది. వన్డే మ్యాచ్‌లన్నీ ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో జరుగనుండగా.. తొలి టీ20 ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో.. రెండు, మూడు టీ20లు వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్‌లో.. ఆఖరి రెండు టీ20లు అమెరికాలోని (ఫ్లోరిడా) బ్రోవార్డ్ కౌంటీ స్టేడియంలో జరుగనున్నాయి. చదవండి: ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తొలి టీ20.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..! -
శ్రీలంకలో దక్షిణాఫ్రికా పర్యటన వాయిదా
జొహన్నెస్‌బర్గ్: శ్రీలంకలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు పర్యటన వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం ఈ జూన్‌లో ఇరు దేశాల మధ్య మూడేసి వన్డేలు, టి20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ అదుపులోకి రాకపోగా... రోజురోజుకీ మహమ్మారి ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో సింహళ దేశంలో క్రికెట్ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు దక్షిణాఫ్రికా బోర్డు వర్గాలు తెలిపాయి. ‘ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో మా ఆటగాళ్లు సిరీస్‌కు సన్నద్ధంగా లేరు. పైగా అన్నింటికి మించి ఆటగాళ్ల ఆరోగ్యం ప్రధానమైంది. వాయిదా వేయాలనే నిర్ణయం భారమైనా... తప్పలేదు. మళ్లీ క్రికెట్ మొదలయ్యాక భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లోని వెసులుబాటును బట్టి ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను రీషెడ్యూల్ చేసుకుంటాం’ అని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్వెస్ ఫాల్ తెలిపారు. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ను వాయిదా వేయడం వల్ల తమ జట్టు టి20 ప్రపంచకప్ సన్నాహకానికి ఎదురుదెబ్బని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న టి20 ప్రపంచకప్ అక్టోబర్–నవంబర్లలో జరుగనుంది. -
క్రికెట్ అభిమానులకు ‘జియో’ గుడ్ న్యూస్
ముంబై : క్రీడల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజే వేరు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీమిండియా మ్యాచ్‌లను తప్పక చూడాలని ఆరాటపడతారు. అయితే అందరికీ మ్యాచ్‌లను చూసే అవకాశం లభించదు. మొబైల్, డెస్క్‌టాప్‌లలో మ్యాచ్‌లను వీక్షించే సౌలభ్యం అందరికీ ఉండదు. అయితే యావత్ క్రికెట్ అభిమానులకు జియో తీపి కబురు తీసుకొచ్చింది. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న టీమిండియా- దక్షిణాఫ్రికా సిరిస్‌ను జియో టీవీలో ఉచితంగా అన్ని ప్రాంతీయ భాషల్లో వీక్షించవచ్చు. ఈ విషయాన్ని జియో అధికారికంగా ప్రకటించింది. దీనికోసం స్టార్ ఇండియాతో జియో టైఅప్ అయింది. ఇప్పటివరకు క్రికెట్ మ్యాచ్‌లను ఆన్లైన్లో చూడాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉండేది. దీంతో కొంత మంది మాత్రమే మ్యాచ్‌లను వీక్షించేవారు. కానీ జియో తన యూజర్లకు ఉచితంగా క్రికెట్‌ను చూసే సౌలభ్యం కల్పించింది. దీనికోసం జియో యూజర్లు గూగుల్ ప్లేస్టోర్/యాపిల్ యాప్ స్టోర్ నుంచి జియో టీవీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడమే. అంతే కాకుండా జియో క్రికెట్ హెచ్డీ అనే ఛానల్‌ను కూడా జియో టీవీ అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రికెట్ ప్రాంతీయ అభిమానుల కోసం ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ కామెంటరీ అందించనుంది. జియో యూజర్లు కాని వారికి కూడా మై జియో యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే మ్యాచ్ స్కోర్, సిరీస్ విషయాలను తెలుసుకోవచ్చు. -
పాక్‌తో క్రికెట్ సిరీస్‌కు అవకాశం లేదు
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం, కాల్పుల్ని ఆపేంత వరకూ పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరగక పోవచ్చని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. విదేశాంగ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంట్ సంప్రదింపుల కమిటీకి ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. సరి హద్దుల్లో ఉగ్ర వాదం, కాల్పులు ఆపనంత వరకూ మ్యాచ్‌లకు అవకాశం ఉండదని, ఉగ్రవాదం, క్రికెట్లు కలిసికట్టుగా సాగలేవని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఖైదీలుగా ఉన్న 70 ఏళ్లు దాటిన వారు, మహిళలు, మానసిక స్థితి సరిగా లేని వారిని మానవతా దృక్పథంలో ఇరు దేశాలు విడుదల చేయాలని భారత్‌లోని పాకిస్తాన్ రాయబారికి ప్రతిపాదించినట్లు ఆమె చెప్పారు. -
క్షుద్రపూజలతో టెస్ట్ సిరీస్ గెలిచాం!
కొలంబో : ఆధునిక టెక్నాలజీతో మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా మారుతున్నవేళ క్రికెట్ రంగంలో ఊహించని పిడుగు! ప్రత్యర్థిని ఓడించాలంటే సమర్థత, మెరుగైన ప్రాక్టీస్, నిలకడతనం కంటే మంత్రాలు, చేతబడులను నమ్ముకుంటున్నవైనం!! ఇటీవల పాకిస్తాన్‌పై శ్రీలంక టెస్టు సిరీస్ నెగ్గడానికి కారణం క్షుద్రపూజలేనని లంక కెప్టెన్ దినేశ్ చండీమల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఏమైంది? : శ్రీలంక- పాకిస్తాన్ జాతీయ జట్ల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వేదికగా(సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 29 వరకు) రెండు టెస్ట్‌లు, ఐదు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. టెస్ట్ సిరీస్‌ను లంక 2-0 తేడాతో కైవసం చేసుకుంది. పర్యటన ముగించుకుని లంక టీం మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ చండీమల్ విలేకరులతో మాట్లాడుతూ సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. మంత్రగత్తె ఆశీర్వాదంతో.. : ‘‘క్రికెట్లో ఆటగాడికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. కాస్త అదృష్టం కూడా కలిసిరావాలని నేను నమ్ముతాను. ఆ అదృష్టం మనకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా దొరుకుతుందో చెప్పలేం. అందుకే మతగురువులు, మంత్రగాళ్లు అనే తేడా లేకుండా అందరి దగ్గరా నేను ఆశీర్వాదాలు తీసుకుంటాను. పాకిస్తాన్‌తో సిరీస్ ఆడేందుకు వెళ్లేముందు ఓ మంత్రగత్తెను కలిశా. శ్రీలంక చేతిలో పాకిస్తాన్ ఓడిపోయేలా చేతబడి చేస్తానని ఆమె మాటిచ్చారు. ఆ తల్లి ఆశీర్వాదబలం, పూజల వల్లే మేం సిరీస్ గెలిచాం’’ అని లంక సారధి చండీమల్ చెప్పారు. రెండు మ్యాచ్‌ల్లోనూ అతను శతకం, అర్థశతకం సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మంత్రాలతో మ్యాచ్‌లు గెలవొచ్చా? : చండీమల్ వ్యాఖ్యలపై యావత్ క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. క్రికెట్లో క్షుద్రపూజలేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఒకవేళ మంత్రాలతో మ్యాచ్‌లు గెలవగలిగితే.. టెస్ట్ సిరీస్ నెగ్గిన శ్రీలంక జట్టు, ఆ తర్వాత జరిగిన వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో దారుణంగా ఎందుకు ఓడిపోయింది?’ అని ప్రశ్నిస్తున్నారు. పాక్‌తో టెస్ట్ సిరీస్ నెగ్గిన లంక.. 0-5తో వన్డే సిరీస్‌ను, 0-3 తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. -
భారత్-పాక్ క్రికెట్ సిరీస్‌కు నో పర్మిషన్?
భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌పై అనిశ్చితి ఏర్పడింది. పాక్‌తో క్రికెట్ సిరీస్‌ను భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, ఇందుకు అనుమతి ఇవ్వకపోవచ్చని కథనాలు వినిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌కు అనుమతివ్వాలన్న బీసీసీఐ ప్రతిపాదనను తిరస్కరించే అవకాశముందని బోర్డు వర్గాల సమాచారం. పాక్‌తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు ఇది సరైన సమయం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. 'ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ప్రభుత్వం సంకేతాలు పంపింది. అంతేగాక భారత్-పాక్ సిరీస్ ఆరంభంకావడానికి కొద్ది రోజులే సమయముంది. పాక్‌తో మనోళ్లు క్రికెట్ ఆడేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టయితే.. ఎప్పుడో అనుమతి పొందేవాళ్లం. భారత్-పాక్ సిరీస్ జరుగుతుందని నేను భావించడం లేదు' అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌పై సుదీర్ఘ చర్చల అనంతరం తటస్థ వేదిక శ్రీలంకలో నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పలుమార్లు సంప్రదింపులు జరిపి.. ఈ నెల మధ్యలో సిరీస్ ప్రారంభించాలని ప్రతిపాదించారు. అయితే భారత ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
'భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ అనుమానమే'
కరాచీ: తాజా పరిణామాల దృష్ట్యా భారత్, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ సిరీస్ జరిగే అవకాశాలు కనిపించడంలేదని పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఈ ఏడాది డిసెంబర్లో దాయాది దేశాల మధ్య సిరీస్ నిర్వహించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిరీస్ నిర్వహించాలంటే ఇరు దేశాలు సుముఖత వ్యక్తం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. దుబాయ్‌లో వచ్చేవారం బీసీసీఐ నూతన అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌తో ఇరుదేశాల మధ్య క్రికెట్ సిరీస్ గురించి ఐసీసీ సమావేశాల్లో చర్చిస్తానని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపిన మరునాడే అజీజ్ ఈ వ్యాఖ్యాలు చేయడం గమనార్హం. 2015 నుంచి 2022ల మధ్య భారత్-పాక్ జట్లు ఆరు సిరీస్‌లు ఆడేందుకు చర్చించనున్నట్లు పీసీబీ చీఫ్ పేర్కొన్నాడు. ఇరుదేశాల మధ్య సిరీస్ జరగకపోవడం అంత మంచిది కాదని అజీజ్ అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలలో పాల్గొన్న భారత్, పాక్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు ఒకరికొకరు దూరంగా ఉండటం కూడా ఈ సిరీస్ పట్ల అనిశ్చితిని కొనసాగిస్తోంది. -
'ఇంతటి భారీ విజయాన్ని ఊహించలేదు'
మీర్పూర్: భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో గెలవడం పట్ల బంగ్లాదేశ్ క్రికెటర్లు సంతోషంలో మునిగితేలుతున్నారు. టీమిండియాతో వరుసగా రెండు వన్డేల్లోనూ భారీ తేడాతో గెలుస్తామని ఊహించలేదని బంగ్లా కెప్టెన్ మోర్తజా అన్నాడు. బంగ్లాతో తొలి వన్డేలో 79 పరుగులో, రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ధోనీసేన పరాజయం చెందిన సంగతి తెలిసిందే. తాము సాధించిన అత్యుత్తమ విజయాల్లో ఇదొకటని మోర్తజా సంతోషంవ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌కు ముందు తమ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, అయితే ఇంతటి భారీ విజయాన్ని అంచనా వేయలేదని చెప్పాడు. విజయం కోసం చివరి బంతి వరకు పోరాడామని అన్నాడు. అత్యుత్తమ క్రికెట్ ఆడితే ఇలాంటి విజయాలు సాధించగలమని, దీనికి కొంత అదృష్టం కూడా కలసి రావాలని మోర్తజా చెప్పాడు. కాగా నిలకడలేమి తమకు ప్రధాన సమస్యని, ఇదే ఆటతీరును కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
6 ఏళ్ల తర్వాత పాక్‌లో క్రికెట్ కళ
లాహోర్: పాకిస్థాన్ పర్యటనకు ఆరేళ్ల తర్వాత టెస్టు హోదా గల క్రికెట్ జట్టు వెళ్లింది. జింబాబ్వే జట్టు మంగళవారం పాక్ కు చేరుకుంది. 2009లో కరాచీలో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత పాక్‌లో పర్యటించేందుకు ప్రపంచ క్రికెట్ దేశాలు నిరాకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాక్ విదేశాల్లో లేదా పాక్ వెలుపలి తటస్థ వేదికలపై ద్వైపాక్షి సిరీస్‌లు ఆడుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు హోదా గల జట్టు పాక్‌కు రావడంతో ఆ దేశానికి క్రికెట్ కళ వచ్చింది. మంగళవారం ఉదయం లాహోర్ వచ్చిన జింబాబ్వే క్రికెటర్లకు అసాధారణ భద్రత కల్పించారు. దాదాపు 4 వేల మంది భద్రత సిబ్బందిని మోహరించారు. పాక్ పర్యటనలో్ జింబాబ్వే రెండు టీ-20లు, మూడు వన్డేలు ఆడనుంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి టి-20 జరగనుంది. 2009లో లంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు భద్రత సిబ్బంది, ఓ డ్రైవర్ మరణించారు. లంక ఆటగాళ్లు బస్సులో సీట్లకిందకు దూరి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. -
పాక్‌తో సిరీస్‌కు సోనోవాల్ మద్దతు
కోల్‌కతా : భారత్, పాకిస్తాన్ క్రికెట్ సిరీస్‌కు కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ మద్దతు పలికారు. ఇరు దేశాల మధ్య క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని అన్నారు. ‘ఓ క్రీడా మంత్రిగా నా ప్రధాన ఉద్దేశం క్రీడల అభివృద్ధికి తోడ్పటమే. పాక్‌తో సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకు ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరిగితేనే బావుంటుంది. అయితే పరిష్కారం కావాల్సిన సమస్యలు కూడా ఉన్నాయి’ అని మంత్రి అన్నారు. -
ఇండో-పాక్ సిరీస్‌కు పచ్చజెండా
-
పాక్‌తో క్రికెట్ సిరీస్ తగదు
కేంద్రానికి బీజేపీ ఎంపీ విజ్ఞప్తి న్యూఢిల్లీ: భారత్ పై దాడులకు దిగే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దని బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా లోక్‌సభలో సూచించారు. రెండు జట్ల మధ్య జరగాల్సిన సిరీస్‌కు అనుమతి ఇవ్వవద్దని సోమవారం జీరో అవర్‌లో ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘హఫీజ్ సయీద్ పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. జకీయుర్ రెహమాన్ లఖ్వీకి ఇటీవలే పాక్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇలాంటి సమయంలో కేంద్రం దీనికి అనుమతి ఇవ్వకూడదు’ అని మాజీ హోం కార్యదర్శి కూడా అయిన సిన్హా కోరారు. -
త్వరలో భారత్, పాక్ క్రికెట్ సిరీస్!
ముంబై: భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ అంటే ఇరు దేశాల్లో అమితాసక్తి. సుదీర్ఘ విరామం తర్వాత దాయాది జట్లు ద్వైపాక్షిక సిరీస్ ఆడే అవకాశముంది. వచ్చే డిసెంబర్లో భారత్, పాక్ మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్.. బీసీసీఐ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియాతో సమావేశమై ఈ మేరకు చర్చలు జరిపారు. పాక్‌లో భారత్ జట్టు పర్యటించాల్సిందిగా ఆయన దాల్మియాను విజ్ఞప్తి చేశారు. ఇందుకు బీసీసీఐ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఐపీఎల్లో ఆడేందుకు పాక్ క్రికెటర్లను అనుమతించాలని పీసీబీ చీఫ్ దాల్మియాను కోరారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల అనంతరం భారత్, పాక్ మధ్య క్రీడా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ కప్ వంటి టోర్నీల్లో దాయాది జట్లు ఆడటం మినహా ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడలేదు. -
సచిన్-రిచర్డ్స్ ట్రోఫీ!
‘మాస్టర్’ పేరుతో సిరీస్ ఆలోచనలో బీసీసీఐ ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరును ఏదో ఒక దేశంతో క్రికెట్ సిరీస్‌కు పెట్టి గౌరవించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల సిరీస్‌కు బోర్డర్-గవాస్కర్ పేరుతో; ఇంగ్లండ్, భారత్ సిరీస్‌కు పటౌడీ పేరుతో ట్రోఫీలు అందిస్తున్నారు. ఇప్పుడు సచిన్ పేరును కూడా ఏదో ఒక సిరీస్‌కు పెట్టాలని బోర్డు పెద్దలు ఆలోచనలో ఉన్నారు. ఈ నెలలో జరిగే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చిస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే... పాకిస్థాన్‌తో ఎప్పుడు సిరీస్ జరుగుతుందో, ఎప్పుడు జరగదో తెలియదు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో సచిన్‌తో సమాన స్థాయి ఉన్న దిగ్గజాలు లేరు. కాబట్టి వెస్టిండీస్, భారత్ సిరీస్‌కు సచిన్-రిచర్డ్స్ ట్రోఫీ ఏర్పాటు చేస్తే మేలనే ప్రతిపాదన ఉంది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో స్వదేశంలో భారత్ ఆడే సిరీస్‌కే ఈ పేరు పెట్టే అవకాశం ఉంది. మాస్టర్ తన చివరి మ్యాచ్‌ను కూడా వెస్టిండీస్‌పైనే ఆడాడు. -
భారత్‌తో ఆరు సిరీస్‌లు: పాక్
లాహోర్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఆరు పూర్థిస్థాయి క్రికెట్ సిరీస్‌లు జరుగుతాయని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లో భాగంగా 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఈ సిరీస్‌లు జరగనున్నాయి. ఇందులో నాలుగు సిరీస్‌లకు పాక్ ఆతిథ్యమివ్వనుందని పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబాన్ అహ్మద్ తెలిపారు. 2008లో ముంబైలో పాక్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదు. అయితే బీసీసీఐ అనుకూల ఐసీసీ పునర్వ్యవస్థీకరణకు పీసీబీ మద్దతు ఇవ్వడంతో మళ్లీ ముఖాముఖీ సిరీస్‌లకు మార్గం సుగమమైంది. -
త్వరలో పాక్‌తో సిరీస్!
న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో త్వరలోనే తటస్థ వేదికపై క్రికెట్ సిరీస్ ఆడించేందుకు బీసీసీఐ ఆలోచిస్తోంది. దుబాయ్, షార్జా లేక అబుదాబిలో ఈ సిరీస్ జరిగే అవకాశాలున్నాయి. ఈమేరకు గురువారం చెన్నైలో జరిగిన బోర్డు అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. ‘తటస్థ వేదికలో పాక్‌తో సిరీస్ జరిపే అంశంపై సమావేశంలో కొద్దిసేపు చర్చ జరిగింది. అయితే ఇప్పటిదాకా తుది నిర్ణయం తీసుకోలేదు. కచ్చితంగా ఈ సిరీస్ జరిపేందుకు ప్రయత్నిస్తాం. అలాగే పాక్ క్రికెట్ బోర్డుతో కూడా మాట్లాడతాం’ అని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చివరిసారిగా భారత్ జట్టు పాక్‌తో 2007-08లో టెస్టు సిరీస్, 2012-13లో వన్డే సిరీస్ ఆడింది. మార్చిలో హాకీ సిరీస్! కరాచీ: మార్చిలో ద్వైపాక్షిక హాకీ సిరీస్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్ వెళ్లే అవకాశాలున్నాయి. హాకీ ఇండియా కార్యదర్శి నరీందర్ బాత్రాతో తను టెలిఫోన్లో సంభాషించినట్లు, ఈ మేరకు ఆయన కూడా ఆసక్తి ప్రదర్శించారని పాకిస్థాన్ హాకీ సమాఖ్య కార్యదర్శి రాణా ముజాహిద్ తెలిపారు. త్వరలోనే ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరిగే వీలుందని చెప్పారు.