లాహోర్: పాకిస్థాన్ పర్యటనకు ఆరేళ్ల తర్వాత టెస్టు హోదా గల క్రికెట్ జట్టు వెళ్లింది. జింబాబ్వే జట్టు మంగళవారం పాక్ కు చేరుకుంది. 2009లో కరాచీలో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత పాక్లో పర్యటించేందుకు ప్రపంచ క్రికెట్ దేశాలు నిరాకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాక్ విదేశాల్లో లేదా పాక్ వెలుపలి తటస్థ వేదికలపై ద్వైపాక్షి సిరీస్లు ఆడుతోంది.
సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు హోదా గల జట్టు పాక్కు రావడంతో ఆ దేశానికి క్రికెట్ కళ వచ్చింది. మంగళవారం ఉదయం లాహోర్ వచ్చిన జింబాబ్వే క్రికెటర్లకు అసాధారణ భద్రత కల్పించారు. దాదాపు 4 వేల మంది భద్రత సిబ్బందిని మోహరించారు. పాక్ పర్యటనలో్ జింబాబ్వే రెండు టీ-20లు, మూడు వన్డేలు ఆడనుంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి టి-20 జరగనుంది.
2009లో లంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు భద్రత సిబ్బంది, ఓ డ్రైవర్ మరణించారు. లంక ఆటగాళ్లు బస్సులో సీట్లకిందకు దూరి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.
6 ఏళ్ల తర్వాత పాక్లో క్రికెట్ కళ
Published Tue, May 19 2015 12:35 PM | Last Updated on Thu, Mar 28 2019 6:14 PM
Advertisement
Advertisement