'భారత్-పాక్ల మధ్య క్రికెట్ అనుమానమే'
కరాచీ: తాజా పరిణామాల దృష్ట్యా భారత్, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ సిరీస్ జరిగే అవకాశాలు కనిపించడంలేదని పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఈ ఏడాది డిసెంబర్లో దాయాది దేశాల మధ్య సిరీస్ నిర్వహించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిరీస్ నిర్వహించాలంటే ఇరు దేశాలు సుముఖత వ్యక్తం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు.
దుబాయ్లో వచ్చేవారం బీసీసీఐ నూతన అధ్యక్షుడు శశాంక్ మనోహర్తో ఇరుదేశాల మధ్య క్రికెట్ సిరీస్ గురించి ఐసీసీ సమావేశాల్లో చర్చిస్తానని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపిన మరునాడే అజీజ్ ఈ వ్యాఖ్యాలు చేయడం గమనార్హం. 2015 నుంచి 2022ల మధ్య భారత్-పాక్ జట్లు ఆరు సిరీస్లు ఆడేందుకు చర్చించనున్నట్లు పీసీబీ చీఫ్ పేర్కొన్నాడు. ఇరుదేశాల మధ్య సిరీస్ జరగకపోవడం అంత మంచిది కాదని అజీజ్ అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలలో పాల్గొన్న భారత్, పాక్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్లు ఒకరికొకరు దూరంగా ఉండటం కూడా ఈ సిరీస్ పట్ల అనిశ్చితిని కొనసాగిస్తోంది.