
లండన్: మహిళల హాకీ ప్రపంచకప్‌లో నిలవాలంటే సత్తా చాటాల్సిన మ్యాచ్ కోసం భారత జట్టు సిద్ధమైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆదివారం ఏడో ర్యాంకర్ అమెరికాతో పదో ర్యాంకర్ భారత్ తలపడనుంది. రియో ఒలింపిక్ చాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్... రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో 0–1తో అనూహ్య పరాజయం పాలైంది. ఈ టోర్నీలో గ్రూప్ టాపర్‌గా నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మిగతా నాలుగు బెర్తుల కోసం ఒక్కో గ్రూపులో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే గ్రూప్ ‘బి’ నుంచి ఐర్లాండ్ 6 పాయింట్లతో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరగా... ఇంగ్లండ్ (2 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది. చెరో పాయింట్ సాధించిన భారత్, అమెరికా వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ ఈ మ్యాచ్‌ను కనీసం ‘డ్రా’గా అయినా ముగించాలి. అప్పుడు భారత్ మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ముందంజ వేస్తుంది. మరోవైపు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న అమెరికా ఐర్లాండ్ చేతిలో 1–3తో ఓడింది.
తేలిగ్గా తీసుకుంటే...
రెండో ర్యాంకర్ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి పోరులో తుదికంటా ఆధిపత్యం చెలాయించిన భారత్ చివర్లో ప్రత్యర్థికి గోల్ సమర్పించుకొని మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. ఈ పోరులో భారత్‌కు ఒక్క పెనాల్టీ కార్నర్ అవకాశం కూడా దక్కకపోయినా... చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రాణి రాంపాల్ బృందానికి ఏడు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. తమ కన్నా తక్కువ ర్యాంక్ కలిగిన ఐర్లాండ్‌ను తేలికగా తీసుకున్న భారత్ తగిన మూల్యం చెల్లించుకుంది. గత మ్యాచ్‌లో జరిగిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత్ ఈ పోరులో ఉదాసీనతకు తావు లేకుండా చెలరేగాలని భావిస్తోంది.
ఫినిషింగ్ లోపం వల్లే...
‘ఈ పోరులో భారత్ తప్పక గెలిచి తీరాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టోర్నీలో మా ప్రణాళికలు బాగున్నాయి. క్రీడాకారిణులు చక్కటి సమన్వయంతో గోల్ అవకాశాలు సృష్టిస్తున్నారు. కానీ ఫినిషింగ్ లోపంతో వాటిని గోల్స్‌గా మలచలేకపోతున్నారు. గత మ్యాచ్‌లో మన అమ్మాయిలు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై 15 షాట్లు కొట్టినా... వాటిలో ఒక్కటీ లక్ష్యాన్ని చేరలేదు. ఈ అంశంపై దృష్టి సారించాం. ఐర్లాండ్‌తో పరాజయం మా మానసిక స్థైర్యంపై ఎలాంటి ప్రభావం చూపదు’ అని కోచ్ జోయెర్డ్ మరీనే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment