ఫుట్‌బాల్ అభివృద్ధికి తోడ్పడతా: గంగూలీ
కోల్‌కతా: భారత్‌లో క్రికెట్ గ్లామర్ ముందు ఫుట్‌బాల్ వెనుకబడిందని, ఈ ఆట అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. కొత్తగా రాబోతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో అట్లెటికో డి కోల్‌కతా ఫ్రాంచైజీకి గంగూలీ సహ యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం ఈ జట్టు జెర్సీని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
‘ఫుట్‌బాల్‌కు ఏదైనా చేసేందుకు ఇది మాకు దక్కిన అవకాశంగా భావిస్తున్నాం. ఇంత ప్రసిద్ధి చెందిన క్రీడ భారత్‌లో క్రికెట్ హోరులో పడి నిర్లక్ష్యానికి గురైంది. ఫుట్‌బాల్‌ను అమితంగా ఆరాధించే కోల్‌కతా నుంచి కచ్చితంగా జట్టు ఉండాలనే భావనతో రంగంలోకి దిగాం. సీఏం ఆశీస్సులతో తొలి టైటిల్‌ను మేమే గెలవాలని అనుకుంటున్నాం’ అని గంగూలీ అన్నాడు. ప్రతీ బెంగాలీ రక్తంలోనే ఫుట్‌బాల్ ఉందని సీఎం మమతా బెనర్జీ అన్నారు.