బెయిర్‌స్టో, ఆర్చర్
మాంచెస్టర్: సొంతగడ్డపై ప్రపంచకప్ సాధించాలనే స్వప్నాన్ని సాకారం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు నాలుగో విజయమే లక్ష్యంగా మరో పోరుకు సిద్ధమైంది. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన అఫ్గానిస్తాన్‌తో నేడు ఇంగ్లండ్ తలపడనుంది. అయితే గాయాల బెడద ఇంగ్లండ్‌ను కలవర పెడుతుంది. ఇప్పటికే డాషింగ్ ఒపెనర్ జేసన్ రాయ్ తొడ కండరాల గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరం కాగా... వెన్ను నొప్పితో బాధపడుతున్న ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నేటి మ్యాచ్‌లో ఆడేది అనుమానమే. ఒకవేళ మోర్గాన్ బరిలోకి దిగకపోతే నేటి మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ జోస్ బట్లర్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
సూపర్ ఫామ్‌లో రూట్
ఈ టోర్నీలో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో అదరగొడుతోంది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా రూట్ రెండు సెంచరీలు సాధించి జోరు మీదున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టుకు అవసరమైన సమయంలో హోల్డర్, హెట్‌మైర్ వికెట్లను తీసిన రూట్ ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ చేయకుండా కళ్లెం వేశాడు. రూట్‌కు తోడుగా బట్లర్, బెయిర్‌స్టో, స్టోక్స్ చెలరేగితే ఇంగ్లండ్ మరోసారి 300 మైలురాయిని దాటడం లాంఛనమే. బౌలింగ్‌లో వోక్స్, జోఫ్రా ఆర్చర్, వుడ్, ఆదిల్ రషీద్‌లతో పటిష్టంగా ఉంది.
ఖాతా తెరవని అఫ్గాన్...
ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన అఫ్గానిస్తాన్ అత్యద్భుత ప్రదర్శన చేస్తే తప్ప ఇంగ్లండ్‌ను నిలువరించడం కష్టం. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్ విభాగంలోనూ వారు అంచనాలను అందుకోలేకపోతున్నారు. నజీబుల్లా, హష్మతుల్లా ఒక్కో అర్ధ సెంచరీ చేయడం మినహా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి పెద్ద స్కోర్లు రాలేదు. బౌలింగ్ విషయానికొస్తే నబీ శ్రీలంక మ్యాచ్‌లో 4 వికెట్లతో అదరగొట్టాక అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయలేదు. రషీద్ ఖాన్, కెప్టెన్ గుల్బదిన్, హమీద్ హసన్ అంతగా ప్రభావం చూపడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment