షకీబ్‌తో కంగారే! | world cup australia vs bangladesh world cup 2019 today | Sakshi
Sakshi News home page

షకీబ్‌తో కంగారే!

Published Thu, Jun 20 2019 5:53 AM | Last Updated on Thu, Jun 20 2019 5:53 AM

world cup australia vs bangladesh world cup 2019 today - Sakshi

షకీబ్‌, ఫించ్‌

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో సెమీస్‌ రేసులో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా నేడు జరిగే లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. సాధారణంగా అయితే ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌కు బంగ్లాదేశ్‌ ఏమంత క్లిష్ట ప్రత్యర్థి కానేకాదు. కానీ ఈ మెగా టోర్నీలో ఒకే ఒక్కడి జోరు ముందు ‘కంగారూ’ పడాల్సిందే. ఆ ఒక్కడు షకీబ్‌ అల్‌ హసన్‌. ఈ బంగ్లా ఆల్‌రౌండర్‌ బ్యాట్‌తో భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బంతితో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాడు.

ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 75, 64, 121, 124 స్కోర్లు చేశాడు. శ్రీలంకతో మ్యాచ్‌ వర్షార్పణమైంది. బౌలింగ్‌లో ఐదు వికె ట్లు తీశాడు. గత మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ 300 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించినా షకీబ్‌ వీరోచిత పోరాటంతో బంగ్లాదేశ్‌ అలవోకగా ఛేదించింది. ఇలాంటి ఆటగాడు ఎదురైతే ఎంతటి మేటి ప్రత్యర్థికైనా కష్టాలు తప్పవు. ఇప్పుడు ఆస్ట్రేలియా వ్యూహమంతా షకీబ్‌ను కట్టడి చేయడంపైనే ఉంది. ఎందుకంటే రెండేళ్ల క్రితం షకీబ్‌ ఆల్‌రౌండ్‌ షోతోనే బంగ్లాదేశ్‌ టెస్టుల్లో కంగారూపై చారిత్రక విజయం సాధించింది. ఆసీస్‌పై కూడా చక్కని రికార్డు ఉన్న షకీబ్‌ ఆ జట్టు పాలిట సింహస్వప్నం కాగలడని ఆస్ట్రేలియా భయపడుతోంది.

మరోవైపు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క భారత్‌ చేతిలో తప్ప అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా సమతూకంతో ఉంది. ఓపెనర్లు ఫించ్, వార్నర్‌లతో పాటు మిడిలార్డర్‌లో స్మిత్, ఖాజా, క్యారీలతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉంది. ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ కూడా ఫిట్‌నెస్‌ సాధించడంతో మార్‌‡్ష బెంచ్‌కు పరిమితం కావొచ్చు. ఇక బంగ్లా జట్టు విషయానికొస్తే గత మ్యాచ్‌లో బరిలోకి దిగి షకీబ్‌తో అజేయ పోరాటం చేసిన లిటన్‌ దాస్‌ను కొనసాగించడం ఖాయం. సౌమ్య సర్కార్, తమీమ్‌లు కూడా స్థిరంగా ఆడుతుండటం జట్టుకు కలిసివస్తుంది. ఇరుజట్ల ప్రదర్శనను పరిశీలిస్తే ఈ మ్యాచ్‌ ఏకపక్షంగా మాత్రం జరుగదని అర్థమవుతుంది. బంగ్లాకు కలిసొస్తే ఆసీస్‌కు షాకిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

జట్లు (అంచనా)
బంగ్లాదేశ్‌: మొర్తజా (కెప్టెన్‌), తమీమ్‌ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబ్, ముష్ఫికర్, లిటన్‌ దాస్, మహ్ముదుల్లా, మొసద్దిక్, సైఫుద్దీన్, ముస్తఫిజుర్, మిరాజ్‌.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్, ఖాజా, స్మిత్, మ్యాక్స్‌వెల్, మార్‌‡్ష/స్టొయినిస్, క్యారీ, కమిన్స్, స్టార్క్, బెహ్రెన్‌డార్ఫ్, రిచర్డ్‌సన్‌.

18: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 18 మ్యాచ్‌ల్లో గెలిచింది. బంగ్లాదేశ్‌ ఒక మ్యాచ్‌లో నెగ్గింది. మరో మ్యాచ్‌ రద్దయింది. ఇక ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆసీస్‌నే విజయం వరించింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement