బ్రెసిలియా: 2014 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీవిజయవంతం కావడంతో విమర్శకులు ఇక నోటికి తాళం వేసుకోవాల్సిందేనని బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రస్సెఫ్ స్పష్టం చేశారు. దేశంలో టోర్నీ ఆరంభానికి ముందు ఎన్నో విమర్శలను చవిచూసినా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నామన్నారు. తాజా మీడియా సమావేశంలో రస్సెఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.' బ్రెజిల్ సాంప్రదాయమైన దేశం. పూర్తి పరిపక్వం చెందిన దేశం కూడా. ఫుట్ బాల్ మా దేశంలో ఒక భాగం. ఇక రాజకీయాలు వేరు. రెండింటికి ముడి పెట్టడం సరికాదు' అని తెలిపారు. టోర్నీ ఆరంభంలో ఎన్నో విమర్శలు చవిచూశాం. ఒకసారి రంగంలోకి దిగాక ఏం సంభవించినా సిద్ధంగా ఉండాలన్నారు. ఆ విమర్శలకు టోర్నీ జరిగిన తీరే తగిన సమాధానం అని తెలిపారు.
ఈ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో జర్మనీ చేతిలో 7-1 తేడాతో బ్రెజిల్ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా అనిపించినా.. గెలుపు-ఓటములు ఆటలో భాగమని ఆమె తెలిపారు.