శ్రీలంక 'చెత్త'రికార్డు!
కొలంబో:భారత్ తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక చెత్త రికార్డను మూట గట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులకే చాప చుట్టేసిన లంకేయులు.. 439 పరుగుల భారీ తేడాతో వెనుకబడ్డారు. దాంతో తన క్రికెట్ చరిత్రలో భారీ పరుగుల తేడాతో తొలి ఇన్నింగ్స్ లో వెనుకబడిన అపవాదును లంకేయులు సొంతం చేసుకున్నారు. భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 622/9 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
అంతకుముందు నాలుగొందల పరుగుల పైగా మొదటి ఇన్నింగ్స్ తేడాను లంకేయులు ఇప్పటివరకూ మూడుసార్లు ఎదుర్కొన్నారు. 2000లో గాలేలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 419 పరుగుల తేడాతో వెనకబడగా, 2009 లో కాన్నూర్ లో జరిగిన మ్యాచ్ లో 413 పరుగుల తేడాను ఎదుర్కొన్నారు. ఆపై 2011 లో కేప్ టౌన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 409 పరుగుల తేడాను లంకేయులు చవిచూశారు. అయితే ప్రస్తుత టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ పరుగుల తేడానే వారి క్రికెట్ చరిత్రలో తొలి స్థానాన్ని ఆక్రమించడం గమనార్హం. దాంతో లంక ఒక కొత్త చెత్త రికార్డును తన పేరిటి మూటగట్టుకున్నట్లయ్యింది.
ఇదిలా ఉంచితే, ఇది భారత్ కు మూడో అతిపెద్ద తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కావడం విశేషం. 2007లో ఢాకాలో బంగ్లాదేశ్ పై సాధించిన 492 పరుగులే భారత్ సాధించిన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యల్లో టాప్ స్థానంలో ఉండగా, ఆపై 2011లో కోల్ కతాలో వెస్టిండీస్ పై 478 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం రెండో స్థానంలో ఉంది.