కుమ్మేసి.. కూల్చేశారు!
కొలంబో: ఊహించిందే జరిగింది. శ్రీలంక బ్యాట్స్మెన్ ఎటువంటి అసాధారణ ఇన్నింగ్స్ లు నమోదు చేయలేదు. భారత బౌలింగ్ కు దాసోహమైన లంకేయులు కనీసం రెండొందల మార్కును కూడా చేరలేకపోయారు. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులకే చాపచుట్టేసింది. టీమిండియా బౌలర్ల ఎటాక్ ను ఎదుర్కోలేక లంక ఆటగాళ్లు వరుస పెట్టి క్యూకట్టేశారు.
50/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన లంకేయలు.. మరో 133 పరుగులు మాత్రమే చేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయారు. లంక ఆటగాళ్లలో నిరోషన్ డిక్ వెల్లా(51)హాఫ్ సెంచరీ మినహా చెప్పుకోదగ్గ స్కోరు లేదు. తొలుత లంక బౌలింగ్ ను కుమ్మేసిన భారత్..ఆపై లంకను పేకపేడలా కూల్చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా, రవీంద్ర జడేజా, మొహ్మద్ షమీలు తలో రెండు వికెట్లు సాధించారు. ఉమేశ్ యాదవ్ కు వికెట్ దక్కింది. అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ను 622/9 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో లంకకు ఫాలో ఆన్ తప్పలేదు.
ఆకట్టుకున్న డిక్ వెల్లా
లంకేయులు వరుసగా వికెట్లు కోల్పోతున్న తరుణంలో డిక్ వెల్లా తీవ్రంగా ప్రతిఘటించాడు. మంచి బంతుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ చెడ్డ బంతుల్ని బౌండరీ దాటించాడు. ఈ క్రమంలోనే 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, అవతలి ఎండ్ నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. లంకేయులు వరుసగా వికెట్లను సమర్పించుకోవడంతో డిక్ వెల్లా సైతం కంట్రోల్ తప్పాడు. షమీ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి ఏడో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై లంక ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు.