పోరాడుతున్న శ్రీలంక
కొలంబో: భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పేకపేడలా కూలిపోయిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో పోరాడుతోంది. మూడో రోజు టీ విరామానికి తమ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 118 పరుగులతో కుదరుగా బ్యాటింగ్ చేస్తోంది. రెండో సెషన్ పూర్తయ్యేసరికి దిముత్ కరుణరత్నే(55 బ్యాటింగ్;97 బంతుల్లో 7 ఫోర్లు), కుశాల్ మెండిస్(61 బ్యాటింగ్; 68 బంతుల్లో 12 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. ఉపల్ తరంగా(2) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్ లో లంకేయులు 183 పరుగులకు చాపచుట్టేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీలంక 321 పరుగుల వెనుకబడి ఉంది.
అంతకుముందు 50/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన లంకేయలు.. మరో 133 పరుగులు మాత్రమే చేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయారు. లంక ఆటగాళ్లలో నిరోషన్ డిక్ వెల్లా(51)హాఫ్ సెంచరీ మినహా చెప్పుకోదగ్గ స్కోరు లేదు. తొలుత లంక బౌలింగ్ ను కుమ్మేసిన భారత్..ఆపై లంకను పేకపేడలా కూల్చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా, రవీంద్ర జడేజా, మొహ్మద్ షమీలు తలో రెండు వికెట్లు సాధించారు.